ఏ క్షణానికి ఏమి జరుగునో.. హెల్మెట్ ధరించి పాఠాలు - MicTv.in - Telugu News
mictv telugu

ఏ క్షణానికి ఏమి జరుగునో.. హెల్మెట్ ధరించి పాఠాలు

August 21, 2019

ప్రభుత్వ పాఠశాల భవనం దుస్థితికి నిరసనగా ఉపాధ్యాయుడు చేపట్టిన వినూత్న నిరసన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అలాగే సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరింది. ఈ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు 89 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆరుగురు ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. మూడు తరగతి గదులు ఉన్నాయి. కాగా, అన్ని శిథిలావస్థకు చేరాయి.

ఈ క్రమంలో స్లాబ్‌ పెచ్చులు ఎప్పుడూ తమపై ఊడి పడతాయనే భయంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనతో పాఠశాలలో కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు ఆ పాఠశాలలో గణిత శాస్త్రం బోధిస్తున్న దస్రు అనే ఉపాధ్యాయుడు విద్యార్థులతో కలిసి వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టారు. తన తలపై హెల్మెట్‌ ధరించి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. ఆ సమయంలో విద్యార్థులు కూడా తమ తలలపై పలకలు ఉంచి నిరసన తెలిపారు.