Different song played instead of national anthem during Congress’ Bharat Jodo Yatra
mictv telugu

రాహుల్ సభలో జాతీయగీతం బదులు మరో పాట

November 18, 2022

Different song played instead of national anthem during Congress’ Bharat Jodo Yatra

కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు ఉత్సాహంగా సాగుతోంది. యాత్రలో రాహుల్.. ప్రజల సమస్యలు వింటూ, తనతోపాటు యాత్రలో పాల్గొంటున్న వారిని ఉత్సాహపరుస్తూ.. ముందుకు సాగుతున్నారు. కానీ, ఈ యాత్రలో కొందరు కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న చిన్నచిన్న పొరపాట్లు అధికార బీజేపీకి విమర్శనాస్త్రాలుగా మారుతున్నాయి. బుధవారం రాహుల్ గాంధీ సభలో ఇలాంటి సంఘటనే చోటుచేసుకోగా.. ఆ వీడియో వైరల్‌గా మారింది.

మహారాష్ట్రలోని వసీమ్‌లో భారత్‌ జోడో యాత్రలో భాగంగా నిర్వహించిన సభలో రాహుల్‌ ప్రసంగం ముగిసిన తర్వాత జాతీయగీతాలాపనకు సిద్ధమయ్యారు. దీంతో సభావేదికపై ఉన్నవారితోపాటు, సభకు హాజరైన వారంతా లేచి నిల్చున్నారు. కానీ, జాతీయగీతం బదులు వేరే పాట వినిపించడంతో ఆశ్చర్యపోయిన రాహుల్‌ వేదికపై ఉన్న నేతలను ఇదేంటని ప్రశ్నించారు. వెంటనే ఆ పాటను ఆపి, జాతీయగీతం ప్లే చేసినట్టు వీడియోలో రికార్డు అయింది. అయితే, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీన్ని బీజేపీ నేతలు ట్విట్టర్లో షేర్‌ చేస్తూ “భారత్‌ను ఏకం చేసేవారి జాతీయగీతం” అంటూ సెటైర్లు చేస్తున్నారు.