Differently capable individual Somya Represented India At International Beauty Pageant 
mictv telugu

ఆత్మవిశ్వాసంతో.. అందాల కిరీటం గెలిచింది!

November 14, 2022

విధి ఆమె జీవితంతో ఆడుకుంది. కానీ ఆమె విధిని తిట్టుకుంటూ కూర్చోలేదు. నిజం చెప్పాలంటే ఒకరి సహాయం లేకుండా నడవలేని స్థితిలో ఉన్న సోమ్య థాకూర్ ఇప్పుడు అందాల కిరీటం గెలుచుకుంది. అంతేకాదు.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కోసం ఎదురుచూస్తున్నదీ అమ్మాయి. చండీఘర్లో పుట్టి పెరిగింది సోమ్య థాకూర్. తండ్రి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యాడు. తండ్రి పేరు రాజేంద్ర సింగ్, తల్లి సరిత. వీరికి సోమ్య ఒక్కతే కూతురు. పదకొండు నెలల వరకు మామూలు అమ్మాయిలాగే పెరిగింది. కానీ అప్పుడే ఒక అంతుచిక్కని వ్యాధి సోకింది. దీంతో ఆమె నడవలేని పరిస్థితికి చేరుకుంది. అప్పటి నుంచి వీల్ చెయిర్కి పరిమితమైంది. అలా వీల్ చెయిర్లో ఉన్నంత మాత్రాన ఆమె ఆత్మవిశ్వాసం అయితే కోల్పోలేదు. చదువులో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని అనుకున్నది. తల్లిదండ్రులకు భారంగా ఉండకూడదని భావించి డిగ్రీ పూర్తి చేసింది. ఆతర్వాత ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఒక కార్పొరేట్ కంపెనీలో హెచ్ఆర్ విభాగంలో పనిచేస్తున్నది. మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందంటారు. సోమ్య విషయంలో అదే జరిగింది. అప్పటికే ఎన్నో ఆటుపోట్లను చూసిందీ అమ్మాయి. అయినా కూడా ఆ దేవుడికి ఆమె పై కరుణ కలుగలేదు. రెండు సంవత్సరాల క్రితం ఒక కారు యాక్సిడెంట్ ఆమె ఆరోగ్యాన్ని మరింత కుంగదీసింది. సంవత్సరం పాటు బెడ్కే పరిమితమైంది. అప్పుడు కూడా ఆత్మవిశ్వాసంతోనే ఉంది సోమ్య.

నచ్చిన అందాల రంగంలో అడుగు పెట్టాలని అనుకున్నదీ అమ్మాయి. చండీఘర్లో జరిగే ఒక కాంపీటేషన్లో కూడా పాల్గొన్నది. అంతేకాదు.. చెన్నైలో లాంగెస్ట్ వీల్చెయిర్ అనే ఒక ఫ్యాషన్ షో జరిగింది. దాంట్లో పాల్గొని గిన్నీస్ బుక్లో కూడా ఆమె పేరును నమోదు చేసుకుంది. ఇక ఈ సంవత్సరంలో ’మిస్ వీల్చెయిర్ వరల్డ్ 2022’ కాంపిటేషన్ జరుగుతుందని తెలిసి అప్లయ్ చేసింది. దాదాపు 30 దేశాల నుంచి ఎంట్రీలు వచ్చాయి. లక్షల్లో అప్లికషన్లు వచ్చాయి. దాంట్లో సోమ్య ఒకరు. అసలు మొదటి రౌండ్లో పాల్గొన్నా చాలు అనుకుంది. తన ఆత్మవిశ్వాసమే ముందుకు నడిపింది. అయితే ఇక్కడ డబ్బులు ఆమె ముందడుగు వేయడానికి కొన్ని ఇబ్బందులు తెచ్చాయి. అందుకే కొన్ని ఆర్గనైజేషన్ల సహాయం తీసుకుంది. ఎలాగో ఈ కాంపిటేషన్లో అడుగు పెట్టింది. మొత్తానికి ఎన్నో రౌండ్లను దాటుకొని టైటిల్ గెలుచుకుంది. అయితే ఇక్కడితో ఆమె ప్రయాణం ఆగిపోలేదు. మరింత ముందుకు వెళ్లాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. అంతర్జాతీయ గుర్తింపు కావాలంటే ప్రభుత్వం కూడా సహాయం చేయాలని తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా కోరుతున్నది . ‘మువ్వన్నెల జెండాను అంతర్జాతీయ స్థాయిలో ఎగురవేయాలన్నది నా ఆశ, ఆశయం’ అంటున్నది సోమ్య. ఆమె ఆత్మవిశ్వాసం ఆమెను గెలిపిస్తుందని మనమూ ఆశిద్దాం. ఆమెకు ఆల్ ద బెస్ట్ చెబుదాం.