Differently teaches in the classes Mancherial science teacher
mictv telugu

కొత్త పద్ధతిలో సైన్స్ పాఠాలు బోధిస్తున్నాడు!

November 23, 2022

పిల్లలూ.. మీ ఒంట్లో ఎన్ని ఎముకలు, ఎన్ని కండరాలు ఉన్నాయో తెలుసా? శరీరంలో ఏ భాగం ఎలా పనిచేస్తుందో గుర్తుపెట్టుకోవడం చిన్న పిల్లలకేంటి, పెద్దలకూ కష్టమే. మరి సైన్స్ పాఠాలను అర్థవంతంగా చెబుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడో టీచర్.

ఒక్కో టీచర్ ఒక్కో పద్ధతిలో పాఠం చెబుతారు. వారు చెప్పే విధానాన్ని బట్టి పిల్లలు అర్థం చేసుకోగలరు. కొందరు పాటల రూపంలో, మరికొందరు బుర్రకథలు.. ఇలా తమకు తోచిన విధంగా పాఠాలు చెబుతూ ఈ మధ్య ఫేమస్ అవ్వడం చూశాం. అలాగే మంచిర్యాలకి చెందిన ఒక మాస్టారు కూడా వినూత్నంగా సైన్స్ పాఠాలను చెబుతున్నాడు. ఆయన పేరు శ్రీనివాస్ జలంపెల్లి. మంచిర్యాల జిల్లా నారాయణ పేట నెన్నెల్ ప్రభుత్వ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్నాడు.

మానవ శరీరం గురించి చిన్నప్పటి నుంచే సరైన అవగాహన ఉండాలి. ప్రతీ అవయం పనితీరు వివరంగా అర్థం అవ్వాలని అనుకున్నాడీ టీచర్. సైన్స్ అంటే భయం పుట్టకూడదు. ఆ సబ్జెక్ట్ అంటే సంక్లిష్టం అనే మాట విద్యార్థుల నోట రాకూడదనుకున్నాడు. సరళంగా.. త్వరగా అర్థం కావడానికి టీ షర్ట్ లను రూపొందించాడు. ఈ టీ షర్ట్ల మీద అవయవాల బొమ్మలను ప్రింట్ చేయించాడు. తాను వేసుకోవడమే కాదు.. పిల్లలకూ వేశాడు. వారికి చూపిస్తూ సరళంగా పాఠాలు బోధిస్తున్నాడు. ‘పిల్లలకు శరీరంపై అవగాహన కలుగాలన్నదే నా తాపత్రయం. నా ఫేస్బుక్ పేజీ ద్వారా ఈ ఫొటోలను పంచుకున్నా. కాసేపటికే అందరి దగ్గరి నుంచి విశేష స్పందన రావడం నాకు ఎంత సంతోషాన్ని కలిగిస్తున్నది’ అంటున్నాడు శ్రీనివాస్. మరి ఆయన ప్రయత్నాన్ని మనమూ అభినందిద్దాం.