Dig a mountain for wife.. ‘Mountain Man’ of MP
mictv telugu

భార్య కోసం భగీరథుడిగా మారి.. చనిపోయేలోపు సాధిస్తానంటూ..

June 9, 2022

భార్య పడుతున్న కష్టాన్ని చూడలేక అపర భగీరథుడిగా మారాడో వ్యక్తి. గుక్కెడు నీళ్ల కోసం కి.మీల వరకూ కాలినడకన ప్రయాణం చేస్తున్న భార్య కోసం.. దాదాపు మూడేళ్లు కష్టపడి స్వయంగా 60 అడుగుల లోతు బావి తవ్వాడు. అది కూడా ఓ కొండ ప్రాంతంలో. మధ్యప్రదేశ్‌లోని సిధీకి చెందిన హరిసింగ్ తన భార్య సియావతి కోసం ఈ కష్టసాధ్యమైన పనిని తలకెత్తుకున్నాడు. ఓ కొండ ప్రాంతంలో నివసిస్తున్న ఈ దంపతులకు సరైన వసతి లేదు. మంచినీరు కావాలంటే దాదాపు 2 కి.మి. నడుచుకుంటూ వెళ్లి తెచ్చుకోవాలి. భార్య పడుతున్న కష్టాన్ని చూడలేక హరిసింగ్ తమకు దగ్గర్లోనే ఓ బావి తవ్వాలని మూడేళ్ల క్రితం నిర్ణయించుకున్నాడు. ఇప్పటివరకు ఒక్కడే 20 అడుగుల వెడల్పు, 60 అడుగుల లోతైన బావిని తవ్వేశాడు. కొద్దిపాటి నీరు రావడంతో అతని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

కొండ ప్రాంతం కావడంతో మరో 60 అడుగులు తవ్వితే తప్ప నీరు సమృద్ధిగా రాదని తెలిసి ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నాడు. చనిపోయే లోపు ఎలాగైనా పనిని పూర్తి చేస్తానని నమ్మకంగా చెబుతున్నాడు హరిసింగ్. `మొదట్లో ఈ పని చేయడం చాలా కష్టమనిపించింది. ఎందుకంటే మొత్తం రాయితో నిండిపోయిన ప్రాంతాన్ని తవ్వడం చాలా కష్టం. అయినా నేను వెనకడుగు వేయలేదు. ఈ ప్రపంచంలో అసాధ్యమనేది లేదు. నేను చనిపోయే లోపు ఎలాగైన ఈ పని పూర్తి చేస్తాన`ని హరి సింగ్ పేర్కొన్నాడు.