Digital detox: A Maharashtra village holds a lesson for all of us
mictv telugu

డిజిటల్ డిటాక్స్.. హారన్ మోగగానే పక్కన పడేయాల్సిందే

September 25, 2022

ఈ డిజిటల్‌ యుగంలో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఫోన్లకి, ల్యాప్‌టాప్‌లకు అతుక్కుపోతున్నారు. గంటలు గంటలు వాటిపైనే ఉంటున్నారు. ఈ అలవాట్ల నుంచి బయటపడేందుకు మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లాలో మొహిత్యాంచే వడ్గావ్‌ అనే గ్రామం వినూత్న విధానాన్ని అనుసరిస్తోంది. దీన్ని డిజిటల్‌ డిటాక్స్‌గా గ్రామస్థులు వ్యాఖ్యానిస్తున్నారు. సర్పంచ్‌ విజయ్‌ మోహితే ఈ మార్గాన్ని ప్రారంభించారు.

గ్రామస్థుల కథనం ప్రకారం.. ప్రతి రోజూ రాత్రి 7 గంటలకు స్థానిక ఆలయంలో ఒక సైరన్‌ మోగుతుంది. అప్పటి నుంచి 8.30 వరకూ గ్రామంలోని అందరూ తమ ఫోన్లు, కంప్యూటర్లు, టీవీలు సహా డిజిటల్‌ పరికరాలన్నింటినీ స్విచాఫ్‌ చేసేస్తారు. ఈ సమయాన్ని పుస్తకాలు చదివేందుకో, ఇరుగుపొరుగువారితో, స్నేహితులతో ముచ్చటించేందుకో కేటాయిస్తారు. 8.30 గంటలకు రెండో అలారం మోగేవరకూ ఇలాగే సేద తీరుతారు.

‘‘కరోనా లాక్‌డౌన్‌ అనంతరం పిల్లలందరూ ఆన్‌లైన్‌ తరగతులకు, తల్లిదండ్రులు టీవీలకు, సామాజిక మాధ్యమాలకు అలవాటుపడిపోయారు. తిరిగి తరగతులు ప్రారంభమైనా.. పిల్లల్లో ఇంకా బద్ధకం అలాగే కొనసాగుతోందని ఉపాధ్యాయులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే డిజిటల్‌ డిటాక్స్‌ అనే ఆలోచన వచ్చింది. మా గ్రామానికి ఇప్పటికే స్వచ్ఛ జాతీయ పురస్కారం దక్కింది. ఎంతోమంది స్వాతంత్ర్యోద్యమ వీరులకు ఇది పుట్టినిల్లు. ఇప్పుడు డిజిటల్‌ డిటాక్స్‌లోనూ విజయం సాధించడం సంతోషంగా ఉంది’’ అని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పేర్కొన్నారు.