జిందాబాద్... జిందాబాద్... డిజిటల్ మీడియా జిందాబాద్..... - MicTv.in - Telugu News
mictv telugu

జిందాబాద్… జిందాబాద్… డిజిటల్ మీడియా జిందాబాద్…..

June 29, 2017

మంత్రి రామారావు చానా విషయాలు డైరెక్టర్ గా మాట్లాడ్తరని ఆయన గురించి బాగా తెల్సిన వాళ్లు చెప్తరు.  డిజిటల్ మీడియా విషయంలో కూడా అట్లనే కామెంట్ చేశారు. డిజిటల్ మీడియా జిందాబాద్  అని ట్విట్టర్లో ట్వీట్ మన్నారు. ఇన్ని రోజులు తర్వాత దానికి ఎందుకు జిందాబాద్ కొట్టారో  తెలియదు కాని… డిజిటల్ మీడియాను  నాయకులు, సంఘాలు, సంస్థలు బాగా వాడుకుంటున్నవి. మంత్రి రామారావు సారు కూడా మస్తుగ వాడుతున్నరు. హైద్రాబాద్ సిటీల యాడన్న చెత్త కనవడ్డట్లు  డిజిటల్ మీడియాల ఫోటో పెట్టంగనే దానిపై  రెస్పాండ్  అవుతున్నరు. పట్నాన్ని దునియాల టాప్ల పెడ్తనని చానా సార్లు అన్నడు… రోడ్ల మీద నూనే పోస్తే ఎత్తుకునే టట్లు చేస్తనని అన్నడ… అంతే కాదు… ఆఫీసుకు పోయే తొందర్ల గిట్ల ఉంటే అట్లనే రోడ్డు మీదికొచ్చి దువ్వుకుంటే రోడ్లు అద్దం లెక్క చేస్తనని కూడా అన్నడు. ఇసోంటి ముచ్చట్లన్నీంటి మీద డిజిటల్ మీడియాల జనాలు అడుగుతనే ఉన్నరు.

ఇగ పట్నం రోడ్ల గుంతల గురించి ఎంత తక్వ చెప్పుకుంటే అంత మంచిది. దీని మీద కూడా డిజటల్ మీడియల మస్తుగ రాస్తున్నరు. గుంతల వడ్డమంటే డైరెక్ట్ గా హాస్పిటల్ల  జాయిన్ కావాల్సిందే. కొంచెం నడుము నొప్పి ఉన్నోళ్లు  అయితే గనుక బాధ చెప్పతరం గాదు… ఇక శుచీ శుభ్రత అయితే పట్నంల యాడ చూసినా కన్పస్తది. పరిసరాలు పరిశుభ్రత మీద డిజిటల్ మీడియాల కామెంట్లు, రాతలు లేని రోజే లేదు. ఎవ్వొరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా డిజిటల్ మీడియా జిందాబాద్.

ఇగ ప్రయివేటు స్కూళ్ల ఫీజుల గురించి డిజిటల్ మీడియా పగిలి పోయేటట్లు  రాతలురాస్తున్నరు… వీడియోల్లు గోడు ఏల్ల వోసుకుంటున్నరు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని అంటున్నరు.  సంపాదన్ల సగానికి సగం ఫీజులకే పోతుందని గోడు గోడు మంటూ గోస  దీస్తున్నరు. ఇవన్నీ అస్సలు మీడియాల కంటే డిజిటల్ మీడియాల్నే రాస్తున్న.   మంత్రి గారు చెప్పినట్లు ఫేస్ బుక్కులనే మస్తు పోస్టింగ్ లు ఉన్నవి. డిజిటల్ మీడియా జిందాబాద్ అని మంత్రి గారు మస్తుగ  అన్నరు.

మంత్రిగారు చెప్పినట్లు తాము చెప్పదల్చుకున్న విషయాలన్నీ డిజిటల్ మీడియా ద్వారా జనాలకు డైరెక్ట్ గా చెప్తున్నరు. వెంటనే ఫీడ్ బ్యాక్ తీసుకంటున్నరు. అంత బాగానే ఉంది. అయితు జనాల బాధలను డిజిటల్ మీడియా నిండా చెప్తనే ఉన్నా… అసలు సమస్యలకు మాత్రం సమాధానం  దొరకడం లేదు.  అయినా డిజిటల్ మీడియా  జిందాబాద్ అనుకుంట జనాలు దాంట్లనే రాస్తనే ఉన్నరు.

నిజంగనే సారు మీరు చెప్పినట్లు డిజిటల్ మీడియా జిందాబాద్. ఎవ్వరూ పట్టించుకోని ముచ్చట్లు…. ఎప్పుడో ఓ సారి పట్టించుకోక పోతరా అనే ధీమాను అదే ఇస్తున్నది. దాంట్ల అంత మంచి లేక పోయినా… బాధలు చెప్పుకునే తొవ్వ అదే ఉంది కాబట్టి రామారావు సారు మీరు చెప్పినట్లు డిజిటల్ మీడియా  జిందాబాద్.