అన్ని చెల్లింపులకు డిజిటల్ విధానాన్ని అమలు చేస్తూ మందు కొనుగోళ్లకు మాత్రం అనుమతివ్వకుండా విమర్శలు ఎదుర్కొంటున్న ఏపీ ప్రభుత్వం దిగి వచ్చింది. రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో ఆన్ లైన్ చెల్లింపులను ప్రారంభించింది. ఆబ్కారీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ శుకవ్రాం డిజిటల్ చెల్లింపులను లాంఛనంగా ప్రారంభించారు. మొదట విజయవాడలోని కేవలం 11 షాపుల్లో వీటిని అనుమతిస్తున్నామని, 3 నెలల్లో అన్ని షాఫుల్లో మొదలవుతాయని ఆయన చెప్పారు. ‘‘ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా డెబిట్ కార్డులను, యూపీఐ లావాదేవీలను వాడుకోవచ్చు.
క్రెడిట్ కార్డులపై మాత్రం నిబంధనల మేరకు చార్జీలు ఉంటాయి. డిజిటల్ చెల్లింపుల వల్ల పారదర్శకత ఉంటుంది. మందు స్టాకు వివరాలూ తెలుస్తాయి’’ అని చెప్పారు. మందు షాపుల్లో డిజిటల్ లావాదేవీల నిర్వహణకు ఎస్‌బీఐ అధికారుల సహకారం తీసుకుంటున్నామన్నారు. ఆ షాపుల్లో డిజిటల్ చెల్లింపులకు ఇప్పటివరకు అనుమతి లేకపోవడంతో మద్యంపై ఎంత ఆదాయమొస్తోందో సరైన లెక్కలు బయటికి రాలేదు. చినచిన్న మొత్తాలకు ఫోన్ పే, గూగుల్ పేలు వాడుతున్నప్పుడు వందలు వేలు ధారపోసే మద్యం కొనుగోళ్లకు ఎందుకు ఒప్పుకోవడం లేదని విపక్షాలు మండిపడ్డాయి. మందుబాబులు కూడా క్యాష్ మస్ట్ కావడంతో ఇబ్బంది పడ్డారు.