Digital school in AP..first for these classes
mictv telugu

ఏపీలో డిజిటల్ బడి..మొదటగా ఈ తరగతుల వారికే

September 19, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్ధినీ, విద్యార్థులకు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ఓ తీపికబురు చెప్పింది. ఇకపై ప్రభుత్వ బడుల్లో డిజిటల్‌ తరగతులను బోధించేందుకు విద్యాశాఖ అధికారులు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మొదటగా ఫౌండేషనల్‌ స్థాయి నుంచి ఇంటర్‌ స్థాయి వరకు అంటే హైస్కూల్‌ ప్లస్‌ స్కూళ్ల వరకు ఈ డిజిటల్‌ తరగతుల బోధనను అందుబాటులోకి తెస్తోన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

”ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ విద్యావిధానం లేకపోవడంతో 3 నుంచి 6 ఏళ్ల వయసు పిల్లలకు సరైన పూర్వ ప్రాథమిక పరిజ్ఞానం అందడం లేదు. నేరుగా 1వ తరగతిలో చేరుతున్న విద్యార్ధులు స్కూలు వాతావరణానికి అలవాటు పడేందుకు కొంత సమయం పడుతోంది. దీనివల్ల ఒకటో తరగతి వయసుకు అలవడాల్సిన అక్షర, సంఖ్యా పరిజ్ఙానం కొరవడుతోంది. ఫలితంగా పై తరగతులకు వెళ్లే కొద్దీ వెనుకబాటుకు గురవుతున్నారు.ప్రథమ్‌ సంస్థ, న్యాస్, రాష్ట్ర స్థాయి సర్వేల్లో ఇవే అంశాలు వెల్లడయ్యాయి. దీన్ని సరిదిద్దేందుకు పూర్వ ప్రాథమిక విద్యకు వీలుగా ఫౌండేషనల్‌ స్కూళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ స్థాయి నుంచే చిన్నారులకు డిజిటల్‌ సాంకేతికతతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆసక్తికరంగా బోధనకు ఏర్పాట్లు చేసింది. ఫౌండేషనల్‌ స్థాయి నుంచి ఇంటర్‌ స్థాయి అయిన హైస్కూల్‌ ప్లస్‌ స్కూళ్ల వరకు డిజిటల్‌ తరగతుల బోధనను అందుబాటులోకి తెచ్చింది” అని అధికారులు తెలిపారు.

ఇక, రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని మూడు దశల్లో ప్రారంభించనున్నారు. మొత్తం 45,328 ప్రభుత్వ స్కూళ్లలో ఈ డిజిటల్‌ తరగతి గదులను ఏర్పాటు చేయనున్నారు. తొలిదశ కింద 15,694 స్కూళ్లలో వీటిని అందుబాటులోకి తెస్తారు. రెండో దశ కింద 2023–24లో 14,331 స్కూళ్లలో, మూడో దశలో 15,303 స్కూళ్లలో డిజిటల్‌ తరగతి గదులను సిద్ధం చేస్తారు. తొలిదశ స్కూళ్లలో డిజిటల్‌ తరగతి గదుల ఏర్పాటును మార్చి, ఏప్రిల్‌ నాటికి పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అందుబాటులోకి తేనున్నారు.