DigiYatra: Know all about facial recognition system for contactless check-in at Hyderabad Airport
mictv telugu

ఇకపై ‘క్యూ’లో నిల్చోవాల్సిన బాధ లేదు.. డిజియాత్ర సేవలు ప్రారంభం

August 19, 2022

విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఎయిర్‌పోర్టులో ఇకపై బోర్డింగ్ పాస్/టికెట్ల కోసం గంటలకుగంటలు క్యూ లో నిల్చోవాల్సిన బాధ లేదు. హైదరాబాద్‌లోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో డిజియాత్ర సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో క్యూ లో నిలబడి డాక్యుమెంట్ల వెరిఫికేషన్ కోసం, బోర్డింగ్ పాసుల కోసం వేచి ఉండాల్సిన ఇబ్బంది లేదు. ఫేషియల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ సాయంతో విమానాశ్రయంలో ప్రయాణికులు టెర్మినల్స్‌కు చేరుకునే సదుపాయంలో భాగంగా కేంద్రం దీనికి శ్రీకారం చుట్టింది. దేశంలో ఈ తరహా సేవలు అందుబాటులోకి ఉన్న ఐదు విమానాశ్రయాల్లో హైదరాబాద్ ఎయిర్‌పోర్టు ఒకటిగా నిలిచింది.

ఎలా ఉపయోగించాలి..
ఈ సౌలభ్యాన్ని వినియోగించుకునేందుకు ప్రయాణికులు తమ సెల్‌ఫోన్‌లో ప్లేస్టోర్‌ నుంచి డిజియాత్ర యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. డిజి యాప్‌ను ఓపెన్‌ చేయగానే ఆధార్‌ లేదా డ్రైవింగ్‌ లైసెన్స్‌ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం ఓటీపీ వస్తుంది. తర్వాత ఫేషియల్ రికగ్నిషన్ కోసం సెల్ఫీ అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సూచనలు అనుగుణంగా వివరాలను నమోదు చేస్తే సరిపోతుంది. సదరు ప్రయాణికుడు ఎయిర్‌పోర్ట్‌లో ఎంట్రీ, ఔట్‌లు ఎలాంటి అవాంతరాలు, సమయభావం లేకుండా పొందొచ్చునని సూచించింది.

దీని సాయంతో ప్రయాణికులు నిర్దేశిత చెక్‌పాయింట్ల వద్ద ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ఆధారంగా నేరుగా వెళ్లవచ్చు. టికెట్లు/బోర్డింగ్‌ పాస్‌ల కోసం ఫిజికల్ ఐడింటిటి కార్డులు చూపించనక్కర్లేదు. ఈ యాప్‌ వినియోగం ఆప్షనల్ మాత్రమేనని, నాన్‌ బయోమెట్రిక్‌ వ్యవస్థ సైతం అందుబాటులో ఉంటుందని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.