సుశాంత్ ఆఖరి చిత్రం ట్రైలర్.. అభిమానుల కంటతడి - MicTv.in - Telugu News
mictv telugu

సుశాంత్ ఆఖరి చిత్రం ట్రైలర్.. అభిమానుల కంటతడి

July 6, 2020

Sushant

అర్థాంతరంగా తనువు చాలించిన బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంకా బతికే ఉన్నట్టుగా ఉంది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సుశాంత్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి వచ్చాడు. పీక్‌లో ఉండగానే ఆత్మహత్య చేసుకోవడం అభిమానులను తీవ్రంగా కలిచివేసింది. అయితే అతను నటించిన చివరి చిత్రం ‘దిల్‌ బేచారా’ ట్రైలర్‌‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాలో సుశాంత్‌కు జోడిగా సంజనా సంఘి నటించింది. సంజనా ట్రైలర్‌ విడుదలకు సంబంధించిన పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. తనకు ఎంతో ఇష్టమైన సీన్లలో ఇది ఒకటి అని తెలిపింది. ట్రైలర్ చూస్తుంటే హీరోయిన్‌కు క్యాన్సర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఆమెకు ఇష్టమైన ప్లేసులకు  హీరో తీసుకెళ్లడం కనిపిస్తుంది. 

ట్రైలర్‌ చూసిన వారందరికీ సుశాంత్ జీవితమే ఆ సినిమా అన్నట్లుగా అనిపించింది. ఇందులో సుశాంత్ నోటి నుంచి వచ్చే ప్రతీ డైలాగ్ కూడా ఆయన అభిమానుల్ని కంటతడి పెట్టిస్తోంది. ‘ఎలా పుట్టాలి ఎప్పుడు చావాలి అన్నది మనం డిసైడ్ చేయలేం.. కానీ ఎలా బతకాలన్నది మాత్రం మన చేతుల్లోనే ఉంది’  ట్రైలర్‌లో వినిపిస్తున్న సుశాంత్ డైలాగులు మరోసారి అభిమానులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయి. ఈ చిత్రం జూలై 24న డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. అయితే ఎలాంటి సబ్‌స్క్రిప్షన్‌ చార్జీలు లేకుండా ఉచితంగా అందరికీ అందుబాటులో ఉండనుంది. కాగా, ఈ సినిమా కథ అప్పట్లో తెలుగులో వచ్చిన ‘ఓయ్’ సినిమాకు కాపీలా ఉందని కొందరు తెలుగు ప్రేక్షకులు సోషల్ మీడియాలో చెబుతున్నారు.