'Dil Dhoondta Hai' singer Bhupinder Singh dies at 82 in Mumbai
mictv telugu

మరో లెజెండరీ సింగర్ కన్నుమూత.. ప్రధాని మోదీ సంతాపం

July 19, 2022

భారత సినీ పరిశ్రమ మరో లెజెండరీ సింగర్ను కోల్పోయింది. దాదాపు 5 దశాబ్ధాలుగా ఎన్నో మధుర గీతాలను ఆలపించి ప్రేక్షకలోకాన్ని అలరించిన ప్రముఖ బాలీవుడ్‌ సింగర్‌ భూపిందర్‌ సింగ్‌ (82) సోమవారం రాత్రి కన్నుమూశారు. భూపిందర్ సింగ్ మరణంతో బాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ వార్త తెలిసిన ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న భూపిందర్ సింగ్.. యూరినరీ సమస్యల కారణంగా ఆస్పత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో భూపిందర్కు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తెలిసింది. దీనితోపాటు ఆయనకు పెద్ద పేగు క్యాన్సర్కూడా ఉన్నట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం (జులై 18) రాత్రి పరిస్థితి విషమించి కన్నుమూసినట్లు ఆయన భార్య మితాలీ సింగ్‌ తెలిపారు.భూపిందర్ సింగ్.. ఐదు దశాబ్దాల పాటు బాలీవుడ్లో ఎన్నో సుమధురమైన గీతాలను ఆలపించారు. అనేక మంది దిగ్గజ సంగీత దర్శకులతో ఆయన పనిచేశారు. ‘నామ్ గమ్ జాయేగా’, ‘దిల్ ధూండతా హై’, ‘దో దివానే షెహర్ మే’, ‘ఏక్ అకేలా ఈజ్ షెహర్ మే’, ‘తోడి సి జమీన్ తోడా ఆస్మాన్’, ‘దునియా చూటే యార్ నా చూటే’ వంటి అనేక క్లాసిక్ పాటలు పాడారు భూపిందర్ సింగ్.

భూపిందర్ సింగ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఆయన పాటలు ఎంతో మందిని కదిలించాయన్నారు. దశాబ్దాల పాటు చిరస్మరణీయమైన పాటలను అందించిన భూపిందర్ సింగ్జీ మరణం బాధగిలిగిందన్నారు. భూపిందర్ సింగ్ కుటుంబ సభ్యుల పట్ల ప్రధాని మోదీ.. ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్ సహా పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.