Dil Raju's explanation on Karthikeya 2 movie
mictv telugu

నేను కొన్ని సినిమాలను తొక్కేస్తున్నానా?… దిల్ రాజు వివరణ

August 16, 2022

Dil Raju's explanation on Karthikeya 2  movie

నిఖిల్ కథానాయకుడిగా నటించిన కార్తికేయ 2 చిత్రం విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. రోజురోజుకీ కలెక్షన్లు, థియేటర్లు పెంచుకొంటూ భారీ విజయం దిశగా సాగుతోంది. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఉత్తరాది ప్రేక్షకులను కూడా ఆకట్టుకోవడంతో రోజుల వ్యవధిలోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. అయితే ఈ చిత్రం విడుదలకు ముందు నిఖిల్ తాను పడ్డ బాధలను మీడియాతో ఏకరువు పెట్టాడు. సినిమా విడుదలకు సహకరించట్లేదని, ఇండస్ట్రీలో తొక్కేస్తున్నారని వాపోయాడు.

దాంతో అందరి చూపు దిల్ రాజుపై పడింది. కొన్ని సినిమాలను తొక్కేస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో వాటన్నింటికీ సమాధానం అంటూ మంగళవారం జరిగిన కార్యక్రమంలో క్లారిటీ ఇచ్చాడు. ‘సినిమాను తొక్కేయాలని ఎవరూ చూడరు. నాగచైతన్య నటించిన థ్యాంక్యూ చిత్ర విడుదలకు సహకరించాలని కార్తికేయ సినిమా నిర్మాతలను కోరాను. వారు సానుకూలంగా స్పందించిన తర్వాతే థ్యాంక్యూ చిత్రాన్ని జులై 8న విడుదల చేశాం. అదే రోజు కార్తికేయ రిలీజ్ సాధ్యం కాలేదు. దాంతో వారు విడుదల తేదీని ఆగస్టు 12కి మార్చుకున్నారు. ఇప్పుడు కార్తికేయ చిత్రం విజయం సాధించడం పట్ల అందరం ఆనందంగా ఉన్నాం. కొందరు తమ వ్యూస్ కోసం అసంబద్ధ ఆరోపణలు చేశారు. మీ స్వార్దం కోసం చిత్ర పరిశ్రమను బలి చేయవద్దు. సినిమా కోసం ప్రాణాలిచ్చే వ్యక్తిత్వం ఉన్న మనిషిని నేను. తప్పుడు వార్తలు రాసేవాళ్లకు, చదివేవాళ్లకు ఉండాల్సిన కనీస తెలివి ఇది’ అంటూ తీవ్రంగా స్పందించారు.