టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్..నిరుపేద కుటుంబం నుంచి వచ్చి స్టార్ ప్లేయర్‌గా అద్భుతంగా ఎదిగిన వ్యక్తి. ప్రస్తుతం అతడి కెరీర్ అత్యుత్తమ స్థితిలో ఉంది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న సిరాజ్ చివరికి టీమిండియా జట్టులో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. వన్డే ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానాన్ని సైతం దక్కించుకున్నాడు ఈ హైదరాబాదీ పేసర్. తాను సాధిస్తున్న విజయాలకు విరాట్ కోహ్లీయే ప్రధాన కారణమని సందర్బం వచ్చిన ప్రతీసారి సిరాజ్ చెప్తుండడం విశేషం. అంతే కాదు. తన జీవితంలో అత్యంత విలువైన వ్యక్తిగా కోహ్లీని సిరాజ్ కీర్తిస్తాడు.
సొంత తమ్ముడిలా..
తాజాగా దినేష్ కార్తీక్ కూడా విరాట్ కోహ్లీ-సిరాజ్ బంధంపై ఇవే విషయాలను వెల్లడించాడు. సిరాజ్‌ను తమ్ముడిలా విరాట్ చూసుకున్నాడని తెలిపాడు. క్రిక్‌బజ్ స్పెషల్ షో’రైస్ ఆఫ్ న్యూ ఇండియా’లో సిరాజ్ గురించి మాట్లాడిన దినేశ్ కార్తీక్.. అతని సక్సెస్‌లో కోహ్లీ పాత్ర గురించి వివరించాడు. సిరాజ్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న ప్రతీ సారి విరాట్ అండగా నిల్చాడని పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో సిరాజ్‌ను వెన్నుతట్టి ప్రోత్సహించినట్లు తెలిపాడు. ఐపీఎల్‌లో ధారళంగా పరుగులిచ్చినా.. ప్రతీ సీజన్‌లో జట్టుతోనే అంటిపెట్టుకున్నాడన్నాడు. ఐపీఎల్ 2020 సీజన్‌కు ముందు ఆర్‌సీబీ అతన్ని వదులుకునే ప్రయత్నం చేయగా విరాట్ కోహ్లీ అడ్డుకున్నట్లు వివరించాడు. ఆ టోర్నీలో సిరాజ్ చెలరేగాడని గుర్తు చేశాడు. రిషభ్ పంత్, శుభ్‌మన్ గిల్, మహమ్మద్ సిరాజ్ సూర్యకుమార్ యాదవ్‌లు కోహ్లీ సారథ్యంలోనే అరంగేట్రం చేశారని దినేష్ తెలిపాడు.
భరత్ అరుణ్ కూడా..
” భారత్ మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ సైతం సిరాజ్ కు అండగా నిలబడాడు. అతడే సిరాజ్‌ను విరాట్ కు పరిచయం చేసింది. హైదరాబాద్ తరఫున సిరాజ్ ఆడిన సమయంలో కోచ్ గా ఉన్న భరత్..అతడి ప్రతిభను పసిగట్టాడు. సిరాజ్‌కు విలువైన సూచనలు అందించి కెరీర్‌ను గాడిలో పెట్టాడు” అని దినేశ్ కార్తీక్ వివరించాడు.