‘రాజ్’ చిత్రంతో బాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించాడు డినో మోరియా. మొదటిసారి తెలుగు ప్రేక్షకులకు విలన్ గా పరిచయం కాబోతున్నాడు.
డినో మోరియా తమిళ చిత్రం కందుకొండైన్ కందుకొండైన్, కన్నడలో జూలీ చిత్రం తో ఇప్పటికీ అడుగు పెట్టేశాడు. ప్రముఖంగా బాలీవుడ్ మీదే దృష్టి పెట్టిన ఈ నటుడు ఇప్పుడు ఏజెంట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ స్పై థ్రిల్లర్ సినిమాలో ప్రతినాయకుడిగా నటించనున్నాడు.
ఈ చిత్రంలో అతను ఏ -గ్రేడ్ యాక్షన్ సన్నివేశాల్లో కనిపిస్తాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తున్నది. అయితే ఒక ఇంటర్వ్యూలో యాక్షన్ సీక్వెన్స్ ల పట్ల తన అభిప్రాయాన్ని చెప్పాడు డినో. అదేమిటంటే.. ‘ నా కెరీర్ ప్రారంభ దశలో చిత్ర నిర్మాతలు, దర్శకులు నన్ను పక్కింటి మంచి అబ్బాయిగా మాత్రమే చూపించారు. నాకు రొమాంటిక్ హీరోగా నటించే అవకాశాలు మాత్రమే వచ్చాయి. కానీ యాక్షన్ సినిమా చేసే అవకాశం రాలేదు. నేను ఫిట్ గా, ఫ్లెక్సిబుల్ గా ఉన్నందున యాక్షన్ లో నేర్పు చూపించగలను’ అని అన్నారు. ఏజెంట్ లో మరి క్రూరమైన ఆ సన్నివేశాలు చాలా బాగా వచ్చే ఉంటాయి.
ఇక ఏజెంట్ గురించి కూడా ఒక చోట ఇలా చెప్పాడు డినో. ఈ సినిమాలో.. ‘నేను మోసపూరితమైన ఏజెంట్ గా కనిపిస్తాను. యాంటీ హీరో. పొడవాటి జుట్టు, గడ్డంతో కనిపిస్తాను. నా ముఖంలో ఎలాంటి వెంట్రుకలు లేకుండా చూసుకొని దాదాపు మూడు సంవత్సరాలైంది. ఏజెంట్ కంటే ముందు ‘ద ఎంపైర్’ కోసం ఈ లుక్ ఉంచాను. ఇందులో కూడా గ్రే షేడ్స్ తో కనిపిస్తాను. నాకు నెగిటివ్ క్యారెక్టర్ లు చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. చిన్నప్పుడు జేమ్స్ బాండ్ సినిమాలు చూస్తున్నప్పుడు అందులో విలన్ లే ఎక్కువగా గుర్తుండిపోయేవారు’ అంటూ చెప్పుకొచ్చారు డినో.
సమ్మర్ లో రాబోయే ఈ ఏజెంట్ సినిమాలో అఖిల్ అక్కినేని హీరోగా, సాక్షి వైద్య హీరోయిన్ గా కనిపిస్తున్నారు. మమ్ముట్టి మరొక ప్రముఖ పాత్రలో కనిపించనున్నారు. దీనికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.