గుండ్రంగా ఉన్నవన్నీ  డైనోసార్ గుడ్లేనా? తమిళనాడులో కలకలం  - MicTv.in - Telugu News
mictv telugu

గుండ్రంగా ఉన్నవన్నీ  డైనోసార్ గుడ్లేనా? తమిళనాడులో కలకలం 

October 23, 2020

'Dinosaur Eggs' found in Perambalur Tamil Nadu are ammonite sediments

గుండ్రంగా ఉన్నవన్నీ డైనోసార్ గుడ్లేనా? అంటూ తమిళనాడులో కలకలం రేగింది. తమిళనాడులోని పెరంబలూరులో డైనోసార్‌ గుడ్ల ఆకృతిలో ఉన్న అవశేషాలు బయటపడ్డాయి. కున్నా జిల్లాలోని ఓ నీటి ట్యాంక్‌ వద్ద అక్కడి స్థానికులు తవ్వకాలు జరిపారు. తవ్వకాల్లో గుండ్రని బంతి ఆకృతుల్లో ఉన్న 25 భారీ పురాతన వస్తువులను గుర్తించారు. అయితే, అవి డైనోసార్‌ గుడ్లేనని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వాటి ఫోటోలను పంచుకుంటూ ఇవి డైనోసార్‌ గుడ్లేనని పేర్కొంటున్నారు. దీంతో ఈ డైనోసార్ గుడ్ల ప్రచారం వైరల్‌గా మారింది. వీటిని చూసేందుకు పెద్ద సంఖ్యలో ఔత్సాహికులు, ప్రజలు తరలివస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న స్థానిక, భూగర్భ, పురావస్తు శాఖల నిపుణుల బృందం ఘటనా స్థలానికి చేరుకుని వాటిని పరిశీలించారు. ఒక్కోదాని బరువు 200 కిలోల వరకు ఉంటుందని వెల్లడించారు. డైనోసార్ల గుడ్లు అన్న ప్రచారాన్ని కొట్టి పారేసిన నిపుణుల బృందం.. అవి అమ్మోనైట్‌ అవశేశాలని నిర్ధారించారు. దాదాపు 416 మిలియన్ సంవత్సరాల క్రితం డెవోనియన్‌ కాలంలో ఏర్పడిన విభిన్న సముద్ర జాతుల సమూహమే అమ్మోనైట్ (అమ్మోనాయిడ్లు) శిలాజాలుగా తేల్చిచెప్పారు.

కొన్ని భారీ సముద్ర జాతులు శిలాజాల రూపంలో శతాబ్దాల మేరకు మిగిలిపోయి ఉంటాయని నిపుణులు తెలిపారు. వీటినే డైనోసార్‌ గుడ్లుగా పేర్కొంటూ దుష్ప్రచారం జరుగుతోందని వ్యాఖ్యానించారు. తమిళనాడులోని ప్రస్తుత అరియలూరు, పెంరబలూరు ఒకప్పుడు సముద్ర గర్భంలో ఉండేవని వెల్లడించారు. జూన్‌‌లో కూడా ఇద్దరు యువకులకు దాదాపు 210 పౌండ్ల బరువు ఉన్న అమ్మోనాయిడ్‌ మిశ్రమాలు కనిపించగా.. వీటిని కూడా డైనోసార్‌ గుడ్లు అని చెప్పి తెగ ప్రచారం చేశారని అన్నారు. కాగా, గత నెలలో డ్రాగన్‌ దేశం చైనాలోని గువాంగ్‌డాంగ్ రాష్ట్రంలోని హేయువాన్ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో ఏకంగా 18 వేల రాకాసి బల్లుల గుడ్లు బయటపడ్డ విషయం తెలిసిందే. కోళ్ల ఫారమ్‌లో వందలు, వేల గుడ్లు ఉత్పత్తి అయినట్లు ఆ ప్రాంతలో డైనోసార్ గుడ్లు బయటపడ్డాయి. 90 లక్షల ఏళ్ల నాటి గుడ్లు కూడా చెక్కుచెదరకుండా దొరికాయి. వాటిని చూడటానికి స్థానికులు ఎగబడ్డారు.