ఆస్ట్రేలియా దేశానికి చెందిన కంగారులు భారతదేశంలో ప్రత్యక్షమైన సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం జల్పాయ్గురి జిల్లాలో రోడ్లపై కంగారులు ప్రత్యక్షమయ్యాయి. వీటిని చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ కంగారులు ఇక్కడికి ఎలా వచ్చాయి? ఎక్కడ నుంచి వచ్చాయి? ఎలా వచ్చాయి? అని స్థానికులు ఆశ్చర్యపోయారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
దీంతో ఘటన స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు.. మూడు కంగారులను తమ సంరక్షణలోకి తీసుకున్నారు. జల్పాయ్గురి జిల్లాలోని గజోల్డోబా ప్రాంతంలో రెండు, సిలిగురిలో ఒక కంగారును కాపాడినట్లు బైకుంత్పూర్ ఫారెస్ట్ డివిజన్ రేంజర్ సంజయ్ దత్ తెలిపారు. మృతి చెందిన మరో కంగారును గుర్తించామని, కంగారుల శరీరాలపై గాయాలున్నాయని, చికిత్స కోసం బెంగాల్ సఫారీ పార్క్‌కు తరలించామని అధికారులు తెలిపారు.
మరోపక్క అధికారులు వాటి సహజ ప్రదేశాలను వదలి ఎలా వచ్చాయి? వాటి శరీరంపై గాయాలు ఎందుకున్నాయి? అనే దానిపై దర్యాప్తు చేపట్టారు. అంతేకాకుండా స్మగ్లర్లు కంగారులను తరలించి ఉంటారని, డీల్ కుదరకపోవడంతో వాటిని అటవీ ప్రాంతంలో వదిలేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై దర్యాప్తు కోసం ఒక బృందాన్ని ఏర్పాటు చేశామని.. బైకుంత్పూర్ ఫారెస్ట్ డివిజన్ రేంజర్ సంజయ్ దత్ తెలిపారు.
పశ్చిమ బెంగాల్లో రోడ్లపై కనిపించిన కంగారుల ఫొటోలు, వీడియోలు తీసిన కొందరు వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎవరో వీటిని నేపాల్‌కు స్మగ్లింగ్ చేయబోయి, ఈ ప్రాంతంలో విడిచిపెట్టి ఉంటారని అటవీశాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.