యువహీరో నితిన్‌పై దర్శకుడు అమ్మరాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. నితిన్ తనను నమ్మించి మోసం చేశాడని ఆరోపించాడు. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో టక్కరి అనే చిత్రం వచ్చింది. సినిమా యావరేజుగా నడిచినా పాటలు, నితిన్ డ్యాన్సులు ఆకట్టుకున్నాయి. దీంతో అమ్మరాజశేఖర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పూర్తి వివరాలు.. అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన హై ఫైవ్ చిత్రం ప్రిరిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమానికి నితిన్ ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది. వస్తానని నితిన్ కూడా మాట ఇచ్చి చివరి నిమిషంలో హ్యాండిచ్చాడు. ఈ విషయంపైనే అమ్మరాజశేఖర్ మాట్లాడారు. ‘పది రోజుల క్రితమే నితిన్‌ను ఆహ్వానిస్తే ఆయన వస్తానని మాటిచ్చారు. దాంతో ఆయన కోసం ప్రత్యేకంగా ఏవీ తయారు చేయించా. ఆయనకు డ్యాన్సు అస్సలే రాదు. అలాంటిది టక్కరి సినిమాలో ఆయనకు డ్యాన్స్ నేర్పించిన గురువులాంటి నేను పిలిస్తే వస్తారని ఆశించా. కానీ, ఇంట్లో ఉండి కూడా రాలేదు. ఫోన్ చేస్తే జ్వరమని చెప్పారు. అయితే కనీసం వీడియో బైట్ అయినా పెట్టమని కోరినా చేయలేదు. రానని చెప్పేసి ఉంటే సరిపోయేది. కానీ, నమ్మించి మోసం చేశాడు. మనం ఎదిగాక దానికి కారణమైన వారిని మర్చిపోకూడదు. ఇది నాకెంతో అవమానంగా, బాధగా ఉంది’ అని వ్యాఖ్యానించారు. దీనిపై నితిన్ రియాక్షన్ రావాల్సి ఉంది.