సినిమాలు బంద్.. కిరాణ కొట్టు పెట్టిన దర్శకుడు - MicTv.in - Telugu News
mictv telugu

సినిమాలు బంద్.. కిరాణ కొట్టు పెట్టిన దర్శకుడు

July 4, 2020

ngvcnb v

లాక్‌డౌన్ దెబ్బ సినీ పరిశ్రమపై గట్టిగానే పడింది. వంద రోజులుగా షూటింగ్స్ ఆగిపోయాయి. ఇంకా కూడా ఎప్పటి నుంచి సినిమాలు సెట్స్ పైకి వెళ్తాయనేది స్పష్టత లేదు. దీంతో సినీ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇప్పటికే చాలా మంది తమ బతుకుదెరువు కోసం రకరకాల ప్రత్యామ్నాయ ఉపాధి వెతుక్కుంటున్నారు. కొంత మంది నటులు షూటింగ్స్ లేక కూరగాయలు, పండ్లు అమ్ముకుంటూ కనిపించారు. తాజాగా ఓ దర్శకుడు ఏకంగా కిరాణ కొట్టు పెట్టుకోవాల్సి వచ్చింది. సినిమాలు తీసే అవకాశం లేకపోవడంతో కొత్త వ్యాపారంలో చేరిపోయాడు. 

చెన్నైకి చెందిన సినీ దర్శకుడు ఆనంద్ కుటుంబ పోషణ భారం కాకుండా ఉండేందుకు ఈ విధంగా కిరాణ కొట్టు తెరిచాడు. పదేళ్లకు పైగా సినిమా రంగంలో ఎన్నో సినిమాలు చేసిన ఆయన ఇలా చేయడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. తన దగ్గర ఉన్న డబ్బులు అయిపోవడంతో ఖాళీగా ఉండలేక స్నేహితుడి సాయంతో కిరాణ షాపు తెరిచినట్టు చెప్పాడు. దీంట్లో నిత్యావసరాలను తక్కువ ధరలకే అమ్ముతున్నట్టుగా చెబుతున్నాడు. సినిమా హాల్స్ తెరిచి, షూటింగ్స్ ప్రారంభం అయ్యే వరకు ఇలా చేయక తప్పదని పేర్కొన్నాడు. కాగా దర్శకుడు  ఆనంద్ గతంలో ‘ఓరు మజాయ్ నాంగు సారాల్’ ‘మౌనా మజాయ్’ సినిమాలు చేసి తమిళ ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ప్రస్తుతం అతడు ‘తునింతు సీ’ అనే సినిమా షూటింగ్ మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. కరోనా తర్వాత దీన్ని పూర్తి చేసి విడుదల చేస్తామని వెల్లడించారు.