టీడీపీ అధినేత చంద్రబాబుపై సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని కందుకూరు, గుంటూరులో జరిగిన ఘటనలపై స్పందిస్తూ.. హిట్లర్, ముస్సోలిని తర్వాత ఆ తరహ వ్యక్తిని చంద్రబాబులో చూస్తున్నానంటూ వ్యాఖ్యానించారు. పెద్ద గ్రౌండ్స్ లో సభలు పెడితే జనం రారని,తనకు మద్దతు లేదని అనుకుంటారనే కారణంతో కానుకల పేరుతో ఆశ పెట్టి జనం ప్రాణాలతో చెలగాటం ఆడారని తీవ్ర వ్యాఖ్యలు చేసారు.
మూడు సార్లు సీఎం గా చేశావ్.. మరేం తెలుసు?
గుంటూరు సభలో కుక్కలు బిస్కెట్లు వేసినట్లు ఎర వేసి జనాన్ని రప్పించి.. ఫొటోలకు ఫోజులిచ్చి చంద్రబాబు వెళ్లిపోయారన్నారు. మూడు సార్లు సీఎంగా చేసిన చంద్రబాబుకు ఏ సభకు , ఎంతమంది జనం వస్తారో.. జనం రద్దీ ఉంటే ఏం చేయాలి.. ఏం జరుగుతుందనేది తెలియదా అని ప్రశ్నించారు. వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం ఇదంతా చేసారని ఆరోపించారు. ఇరుకు సందుల్లో సభలు పెట్టి, ఏవో ఇస్తామని జనాన్ని రప్పిస్తే ఏం జరుగుతుందో 40 ఏళ్ల చరిత్ర ఉన్న మీకు తెలియదా అంటూ ఆర్జీవి ప్రశ్నించారు. మీ మద్దతు దారులు అయితే నమ్ముతారని, తాను నమ్మనంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. సభలను జనాలను రప్పించటానికి ఏవేవో ఇవ్వటం.. క్వార్టర్ బాటిల్స్ ఇవ్వటం చంద్రబాబు ప్రారంభించారనేది దేశం మొత్తం తెలిసిన విషయమని ఆర్జీవీ చెప్పుకొచ్చారు. సభలకు వస్తే కానుకలు ఇస్తామనే విధానం ప్రవేశ పెట్టింది కూడా ఆయనేనన్నారు.
పాపులారిటీ కోసమే ఇదంతా..
ఇదే సమయంలో చంద్రబాబును ఇక నుంచి తాను మీరు అనకుండా “నువ్వు” అనే పిలుస్తానని ఆర్జీవి స్పష్టం చేసారు. రాజకీయ నేతకు ముందుగా ప్రజల భద్రత ముఖ్యమని చెప్పారు. కానీ, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి.. తన వ్యక్తిగత పాపులారిటీ కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేసారని ఆర్జీవి చెప్పుకొచ్చారు. మరణించిన వారి మీద నిలబడి పాపులారిటీ పెంచుకొనే ప్రయత్నంగా ఆర్జీవీ తెలిపారు.