‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఆస్కార్ రావడంపై దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. నిజంగా ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ ఇవ్వకపోతే అది ఆస్కార్ వాళ్ల దురదృష్టమని చెప్పుకొచ్చారు. ‘‘ఆర్ఆర్ఆర్‌కి అవార్డు వచ్చినా.. రాకపోయినా పెద్ద ఇబ్బంది లేదు. ఎందుకంటే.. దాని రేంజ్ ఏంటో ఇప్పటికే చాలామందికి తెలిసిపోయింది. ఇంకో విషయం.. ఈ సినిమాకి అవార్డు ఇవ్వకపోతే.. అది ఆస్కార్ వాళ్ల దురదృష్టం అయ్యేది. నిజం చెప్పాలంటే.. కీరవాణి పాటల్లో ‘నాటు నాటు’ కాకుండా నాకు నచ్చిన 50 సాంగ్స్ ఉన్నాయి. కానీ ఏది ఎవరికీ ఎందుకు నచ్చుతుందో మనం చెప్పలేం’ అని అన్నారు
ఇక్కడ కొంతమంది అవార్డు కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టారని విమర్శలు చేస్తున్నారు. బాంబేలో కూడా ఇదే మాట అంటున్నారు. పబ్లిసిటీకి కోసం ఖర్చు పెట్టడం సాధారణంగా జరిగేదే. దాని గురించి మాట్లాడడం చాలా సిల్లీ విషయం అవుతుంది. బుర్ర తక్కువ వాళ్లే అలా మాట్లాడతారు. అలాగే.. డబ్బులు ఖర్చు పెడితే అవార్డు వచ్చేది నిజమైతే.. హాలీవుడ్ వాళ్లు ఖర్చు పెట్టలేరా. అవెంజర్స్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలను సంవత్సరానికి చాలా సినిమాలు హాలీవుడ్‌లో తీస్తారు కదా. వారికి లాబీయింగ్ చేయడం అంత కష్టమా? అని ప్రశ్నించారు.
రాజమౌళి తెలుగు సినిమా స్థాయిని పెంచాడని, టాలీవుడ్ చిత్రాలకి అంతర్జాతీయ స్థాయిలో రెవెన్యూ వస్తుందన్నారు. దీనికోసం రూ.80 కోట్లు కాదు.. రూ. 1000 కోట్లు పెట్టిన తక్కువేనని చెప్పారు. అలాగే.. ఆ ఇంటర్వ్యూలో అవార్డుల కోసం ఎందుకు ప్రయత్నించలేదని యాంకర్ ఆర్జీవీని అడిగింది. దానికి జవాబు చెబుతూ.. ‘నాకు అవార్డుల మీద అంత నమ్మకం లేదు. సినిమాకి అవార్డుల సంబంధించిన విషయాన్ని కొంతమంది కూర్చుని డిసైడ్ చేస్తారు. నా సినిమాలకు వేరే వ్యక్తి ఒపీనియన్ ఇవ్వడం నాకు నచ్చదు. వారి ఒపీనియన్‌కి నేను విలువ ఇవ్వను. అందుకే ఆ అవార్డులకు విలువ ఇవ్వను’ అని తెలిపారు.