‘నలుగురికి నచ్చినది నాకు అసలే నచ్చదురో’ అనుకుంటూ.. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ గొప్ప వ్యక్తి అని, ఆయన ఓ పొలిటికల్ హీరో అని, నమ్మిన సిద్ధాంతాన్ని పాటించేందుకు ఎన్టీఆర్ ఎప్పుడూ భయపడలేదని అన్నారు. ఆయన నిర్మించనున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రానికి సంబంధించిన ప్రెస్ మీట్లో వర్మ మాట్లాడుతూ.. లక్ష్మీపార్వతి గురించి చెప్పగలిగే ఒక్కగానొక్క వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. ఆయన లక్ష్మీపార్వతి గురించి గొప్పగా మాట్లాడిన వీడియో యూట్యూబ్లో చూశానని పేర్కొన్నారు.నిజాలు చూపించేలా సినిమా తీయగలిగే సత్తా ఎవరికి లేదని, తాను తీసి చూపిస్తానని వర్మ స్పష్టం చేశారు. అయితే అలనాటి నటీమణులు శ్రీదేవి, జయసుధ, జయప్రదలో లేని ఆకర్షణ… లక్ష్మీపార్వతిలో ఏముందని తాను ఆశ్చర్యపోయానని ఆయన అన్నారు. అంతటి ఆకర్షణను కాదని… ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని పెళ్లిచేసుకోవడం షాక్ అయ్యానని అన్నారు. ఆ విషయం తన ఊహకు అందలేదని రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని జనవరి 24న విడుదల చేస్తున్నామని, తమకు ఎన్టీఆర్ ఆశీస్సులు అందిస్తారని వర్మ పేర్కొన్నారు.