హిట్టు కొట్టాలే.. లేకపోతే మీ పని అంతే ! - MicTv.in - Telugu News
mictv telugu

హిట్టు కొట్టాలే.. లేకపోతే మీ పని అంతే !

August 9, 2017

గెలిచినవాడి కన్నా ఓడిన వాడి దగ్గరే నేర్చుకోవడానికి చాలా దొరుకుతుంది. సినిమా ఇండస్ట్రీలో గెలుపు ఓటములు సహజం. ఒక సినిమా హిట్టవగానే అతణ్ని ఆకాశానికి ఎత్తేస్తారు. ఫ్లాప్ అయితే ఎవరూ పట్టించుకోరు. ఆ కోవలోకి చాలా మంది వచ్చారు, పోయారు. డైరెక్టర్ తేజా ‘ చిత్రం ’ సినిమాతో ఇండస్ట్రీలో తన పాగా వేస్కున్నాడు. తర్వాత వరుస హిట్లిచ్చాడు. అటు తర్వాత ఎందుకో వరుసగా లక్ష్మీ కళ్యాణం, కేక, నీకు నాకు డాష్ డాష్, హోరా హోరీ వంటి అతని సినిమాలు ఫ్లాపులను మూట గట్టుకోవడంతో తీవ్ర నిరాశలో కృంగిపోయాడు. ప్రస్తుతం 11 ఆగస్టుకు వస్తున్న ‘ నేనే రాజు నేనే మంత్రి ’ సినిమా మీద బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. సినిమావాడిగా సినిమావాళ్ళ మీద, ప్రేక్షకుల మీద తనదైన తరహాలో పంచు వేసాడు తేజా. ‘ రాజకీయాల్లో ఐదేళ్ళకొకసారి పార్టీలు మారుతారు నాయకులు. కానీ సినిమా ఫీల్డులో వారానికొకసారి పార్టీ మారుతుంటారు. ఈ వారం సినిమా రిలీజ్ అయి దాని రిజల్ట్ ని బట్టి వుంటుంది తర్వాత ఫ్యూచర్ ?

సినిమా హిట్ టాక్ తెచ్చుకున్న మరుసటి రోజు నుండే ఆ డైరెక్టర్ ఇంటి ముందు చేతుల్లో అడ్వాన్సులు పట్టుకొని మరీ క్యూలు కడతారు ప్రొడ్యూసర్లు. అదే సినిమా ఫ్లాప్ అయితే ఇచ్చిన అడ్వాన్సులను కూడా లాక్కుంటారు. ప్రేక్షకులు కూడా సినిమా బాగా తీస్తే మెచ్చుకుంటారు. బాగా తియ్యకపోతే తిట్టుకుంటారు ’ అని తేజా తన బాధను వెళ్ళగక్కారు.

అలాగే బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హాష్మీ కూడా తన వరుస ఫ్లాపు సినిమాల గురించి మీడియా అడిగినప్పుడు చాలా ఘాటుగానే స్పందించాడు. ‘ మేము ఏ సినిమా చేసినా ఫుల్లు ఎఫర్ట్ పెట్టే చేస్తాం. కానీ ఫలితాలు అనేవి మా చేతుల్లో వుండవు కదా. ఇక్కడ సినిమా హిట్టైనా – ఫ్లాపైనా అది ఏ ఒక్కరి బాధ్యత అన్నట్టు క్రియేట్ చెయ్యొద్దు. అవి రెండూ టీం యొక్క సమిష్ఠి కృషే. ఒక్కర్నే పాయింటౌట్ చెయ్యడం సరికాదు ’ అన్నాడు.

అలాగే ఫ్లాపయ్యే సినిమాలను తీసేకన్నా తియ్యకపోవడమే బెటర్ అంటున్నాడు. ఎందుకంటే ఒక కథను ముందుగానే జడ్జ్ చేసి తియ్యాలా ? వద్దా ? అని డిసైడ్ చేస్కోవాలి. అప్పుడే మంచి సినిమాలు వస్తాయి. నిజమే సినిమా హిట్టా, ఫ్లాపా అనేది స్క్రిప్ట్ పేపర్ మీదే తెలిసిపోతుందంటారు. అప్పుడే తెలుసుకుంటే మంచిదని కాబోలు ఇమ్రాన్ మాటలోని అర్థం. తనవి కూడా వర్సగా అజహర్, రాజ్ రిబూట్, హమారీ అధూరీ కహానీ వంటి సినిమాలు వరుస ఫ్లాపులయ్యాయి. 1 సెప్టెంబర్ 2017 కు విడుదలౌతున్న తన లేటెస్ట్ మూవీ ‘ బాద్ షాహో ’ మీద ఇమ్రాన్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఫ్లాపులతో విసుగెత్తిన డైరెక్టర్ తేజాకు, హీరో ఇమ్రాన్ హాష్మీకి ఈ రెండు సినిమాలు హిట్టై వారికి గత వైభవాన్ని తీసుకురావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెబుదామా.

కొసమెరుపు ఏమిటంటే నేనే రాజు నేనే మంత్రి సినిమా ప్రమోషన్ ఘనంగా వుండటంతో అప్పుడే సినిమా హిట్టయిపోయినట్టు కొందరు ప్రొడ్యూసర్లు అడ్వాన్సులు తీస్కొని డైరెక్టర్ తేజా ఇంటికి వెళ్తున్నారట. కానీ తేజా వాళ్ళను చల్లగా తిరస్కరిస్తున్నాడట. ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యాక అది హిట్టైన తర్వాత నా దగ్గరికి రండని చెప్తున్నాడట.