ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా కమెడియన్ వేణు మొదటిసారి దర్శకుడిగా మారి తెరకెక్కించిన బలగం సినిమాపై వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. బలగం కథ నాదంటూ..గడ్డం సతీష్ అనే జర్నలిస్ట్ ఆరోపిస్తున్నాడు. తన కథని కాపీ కొట్టారని సినిమా బృందంపై విమర్శలు గుప్పించారు. దీనిపై తాజాగా బలగం దర్శకుడు వేణు స్పందించారు. బలగం కథ తనదే అంటూ ఆయన వివరణ ఇచ్చారు.
తాను 18 ఏళ్ళు ఉన్నప్పుడు తన పెదనాన్న, ఆ తర్వాత రెండో పెదనాన్న, పెద్దమ్మ చనిపోయారన్నారు. చనిపోయినప్పుడు తాగుతున్నారు, ఏడుస్తున్నారు, కొట్లాడుకుంటున్నారు. ఆ సన్నివేశాలన నుంచే బలగం కథ పుట్టుకొచ్చిందని వేణు తెలిపారు. జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్, నేను కలిసి కొన్ని పల్లెటూళ్ళు తిరిగి ఈ కథపై రీసెర్చ్ చేసినట్లు వెల్లడించారు. “ఒక్కొక్కరు ఒక్కో కథ చెప్పారు. అసలు ఇది కథ కాదు, మన ఇళ్లల్లో జరిగే సంఘటనలు. ఫైనల్ సాంగ్ కోసం తెలంగాణ బుడగ జంగాల దగ్గర రీసెర్చ్ చేసి మరీ పాడించాం. సినిమా క్లైమాక్స్ చూసి చాలా మంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ ఒక్క సినిమా కథ కోసం ఆరేళ్ళు కష్టపడ్డాను” అని వేణు వివరించారు.
జర్నలిస్ట్ సతీష్ కథకి తన కథకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. సతీష్ ఎవరో కూడా తనకు తెలీదని తెలిపారు. సతీష్ కోరితే దిల్ రాజు పిలిపించుకొని మాట్లాడరంటూ వెల్లడించారు. ఆ మాత్రం దానికి దిల్ రాజు భయపడ్డారంటూ ప్రెస్ మీట్‌లో చెప్పారని.. దిల్ రాజు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. సతీష్ వచ్చి తనతో మాట్లాడాలి కానీ దిల్ రాజు లాంటి పెద్ద ప్రొడ్యూసర్ తో మాట్లాడాల్సిన అవసరం ఏముందంటూ ప్రశ్నలు సంధించారు. ఇది తెలంగాణ సంస్కృతి అని.. ఇదే సంస్కృతిపై 100 మంది100 సినిమాలు తీయొచ్చని వేణు అన్నారు. దీనిపై అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామన స్పష్టం చేశారు.