ఒరేయ్.. మరీ ఇంత పిసినారివార!  దొంగోడి లెటర్ - MicTv.in - Telugu News
mictv telugu

ఒరేయ్.. మరీ ఇంత పిసినారివార!  దొంగోడి లెటర్

December 7, 2019

ఎంతో కష్టపడ్డాడు…గంటపాటు కిటికీ ఊచలు వంచి మరీ లోపలికి వెళ్లాడు. హాలు, వంటగది, పడగ్గది, బాత్రూమ్, స్టోర్ రూం.. అటకలు, పెట్టెలు అన్నీ వెతికాడు. పిసరంత బంగారం కదా కదా చిన్న వెండిముక్కగాని, ఒక్క రూపాయి కనిపిస్తే ఒట్టు. దొంగకే కాదు, ఎవరికైనా సరే అలాంటి అనుభవం ఎదురైతే బాధగా ఉండదాండి! ఆ దొంగకు కూడా అంత బాధేసింది. పైగా ఒట్టి దొంగ కూడా కాదు, చదువొచ్చిన దొంగ. వెంటనే కాగితం ముక్క వెతికి.. ఆ ఇంటి యజమానిని .. ఎంత పిసినారివిరా నువ్వు.. చెడామడా తిట్టుతూ బరికాడు.. 

భోపాల్‌ ఆదర్శనగర్ లోని ఓ సర్కారీ బంగాళాలో ఈ నెల 4 జరిగిందీ విఫల చర్యం. పర్వేష్ సోనీ అనే ఇంజినీరు నివసిస్తున్న ఆ ఇంట్లోకి ఓ దొంగ కష్టపడి కిటీకీలు బద్దలు కొట్టి చొరబడ్డాడు. డబ్బూదస్కం కోసం ఇళ్లంతా వెతికాడు. క్షణం క్షణం టెన్షన్‌తో చితికిపోయాడు. పనికొచ్చేదేదీ దొరక్కపోవడంతో ఊసురుమాన్నాడు. ఆ నిట్టూర్పు నుంచి ఆగ్రహం ఎగదన్నుకొచ్చింద. ఓ కాగితమ్ముక్క తీసుకుని  ‘బహుత్ కంజూస్ హైరే తు.. ఖిడ్కీ తోడ్నేకీ మెహ్నత్ బీ హీ మిలీ.. రాత్ ఖరాబ్ హో గయీ’ అని గీకాడు. కిటీకీ బద్దలు కొట్టినా చిల్లిగవ్వ దొరకలేదని, రాత్రి పడిన కష్టమంతా కొరగాకుండా పోయిందని వాపోయాడు. మరుసటి రోజు ఇంటికొచ్చిన పనిమనిషి విషయం తెలుసుకుని పర్వేష్‌కు చెప్పింది. అతడు తాపీగా వచ్చి ఇళ్లంతా చూశాడు. దొంగోడు కంగాళీ చేస్తే చేశాడు గాని ఏదీ తీసుకుపోలేదని ఊపిరి పీల్చుకున్నాడు. దొంగోడి ఉత్తరం చూసి నవ్వుకుని పోలీసులకు విషయం చెప్పాడు.