క్రమ శిక్షణకు మారుపేరు మన హైదరాబాదు ! - MicTv.in - Telugu News
mictv telugu

క్రమ శిక్షణకు మారుపేరు మన హైదరాబాదు !

August 19, 2017

మనం వూహించని గొప్ప మార్పు ఇది. కళ్ళు గిర్రున తిరిగి రోడ్డు మీద పడి గిలాగిలా కొట్టుకునే గొప్ప మార్పు. హైదరాబాదు షహర్లో మనం కనీవినీ ఎరుగని కమ్మని దృశ్యమిది. చూసారా ఎంత డిసీప్లేన్ గా రోడ్డు మీద సిగ్నల్ దగ్గర గీత ఆవలకు వాహనాలను ఆపుకున్నారో. ఆహా ఇది నిజంగా హర్షించదగ్గ విషయం. ఇలాంటి దృశ్యాన్ని అసలు చూస్తామా లేదా అన్న కంటికి ఇది నిలువెత్తు సాక్ష్యం. క్రమ శిక్షణకు మారుపేరు మన హైదరాబాదు అన్నంత క్రేజును క్రియేట్ చేస్తోంది ఈ సీన్. పట్నం జనాలకు ఇన్ డిసిప్లేనే కాదు డిసీప్లేన్ కూడా తెలుసని నిరూపించారు. ఇన్ని రోజులూ ట్రాఫిక్ పోలీసులు గీత దాటిన వారికి, సిగ్నల్ క్రాస్ చేసిన వారికి, హెల్మెట్ ధరించని వారికి చలాన్లు విధించింది. రూల్స్ ను మరింత కష్టతరం చేసింది. ట్రాఫిక్ రూల్స్ పాటించండి బాబులూ అని ట్రాఫిక్ పోలీసులు ఎంత మొత్తుకున్నా ఎవ్వరూ పాటించిన పాపానికి పోలేదు. రెడ్ సిగ్నల్ పడగానే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వాహనాలను డిసిప్లేన్ లేకుండా ఆపుకొని వుండేస్తారు. ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ పడుతుందా, ఎప్పుడు పరుగెత్తుదామా అన్నట్టుంటారు ఒక్కొక్కళ్ళు. ఆరెంజ్ లైట్ పడగానే అందరూ గేర్లు వేస్కొని ఎక్సెలేటర్ పట్టుకొని రేసుకు సిద్ధం అన్నట్టుంటారు.

గ్రీన్ సిగ్నల్ పడగానే రోడ్డు మీద రయ్యున దూసుకుపోతుంటారు. ఖర్మకాలి అడ్డం ఎవరైనా వస్తే మటాషే ? ట్రాఫిక్ వాళ్లకు వాహనదారులతో ఎక్కడలేని తల నొప్పులు తయారయ్యాయి. ఎన్ని రూల్స్ పెట్టినా ఎవ్వరూ వినరు, రూల్స్ అస్సలు ఫాలో అవ్వరు. ఎన్ని చలాన్లు కట్టినా కడతారు కానీ రోడ్డు మీద పద్ధతులు మాత్రం పాటించరు. ‘ తినగ తినగ వేము తియ్యనుండు ’అన్నట్టు రూల్స్ రుద్దంగ రుద్దంగా ఇప్పడిప్పుడు నగరవాసులు దారిలోకొస్తున్నారన్నమాట. ఇది ట్రాఫిక్ పోలీసులుకు అత్యంత సంబర పడాల్సిన ముచ్చట.

వాళ్ళు గొప్ప విజయాన్ని సాధించామనే సంతోషంతో దావత్ చేసుకోవాల్సిన సందర్భమిది. నిజమే హైదరాబాదు నగరం ఎప్పటికీ ఇంత డిసీప్లేన్ గా వుంటే ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులుండవేమో. రోడ్డు మీద స్వేచ్ఛగా కాదు విధి పూర్వకంగా వాహనం నడపితే అందరూ బాగుంటారు. అలాగే లైసెన్సు, ఆర్ సి, పొల్యూషన్ కాగితాలను కూడా సక్రమంగా వుంచుకుంటే అప్పుడింకా డిసీప్లేన్ కొచ్చినట్టే కదా ! అలాగే అవసరం లేకున్నా హారన్లు కొట్టేస్తూ, బుల్లెట్ల మోతలతో పక్కవాడి చెవుల పర్దాలు చింపేస్తున్నారు. అలాంటి ధ్వని కాలుష్యాన్ని కూడా నివారించ గలిగితే ఎంత బాగుంటుందో. అది కూడా అధికారుల చేతుల్లో లేదు నగరవాసుల చేతుల్లోనే వుంది.