జీవో నెంబర్ 69ని నిలిపివేయండి: ఏపీ హైకోర్ట్
ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ జగన్ ప్రభుత్వానికి సినిమా టికెట్ల విషయంలో ఓ కీలక ఆదేశాన్ని జారీ చేసింది. జీవో నెంబర్ 69ని వెంటనే నిలుపుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆన్‌లైన్ టికెట్ల విక్రయంపై తుది విచారణను ఈనెల 27కి వాయిదా వేస్తూ, ఉత్తర్వులు జారీ చేసింది.
వైసీపీ ప్రభుత్వం ఆన్‌లైన్లో సినిమా టికెట్ల విక్రయానికి అనుమతి ఇస్తూ, ఇటీవలే జీవో నెంబర్ 69ని జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ జీవోను సవాల్ చేస్తూ, ఏపీ హైకోర్టులో బుక్ మై షో, విజయవాడలోని మల్టీప్లెక్సుల ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దాంతో రెండు రోజులపాటు వాదోపవాదాలు విన్న హైకోర్టు ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. అయితే, టికెట్ విక్రయం ద్వారా సర్వీసు ఛార్జీ కింద వచ్చే రూ.2లో ప్రభుత్వానికి రూ.1.97వెళుతుందని, తమకు కేవలం మూడు పైసలు మాత్రమే వస్తుందని పిటిషనర్ల తరపు లాయర్లు వాదనలు వినిపించారు.