సంక్రాంతి పండగ పేరు చెప్పి నిలువునా దోచేసేందుకు సిద్ధమవుతున్న ప్రైవేట్ బస్సుల ఆగడాలకు చెక్ పెట్టేందుకు ఏపీఎస్ఆర్టీసీ చర్యలు చేపడుతుంది. ఇప్పటికే సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసింది. ఆర్టీసి ప్రత్యేక బస్సుల్లో ప్రయాణాలకు ఆన్లైన్ రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. రెండు వైపులా ప్రయాణాలకు టిక్కెట్లను బుక్ చేసుకునే వారికి పది శాతం రాయితీ కల్పిస్తారు. అన్ని దూర ప్రాంత సర్వీసులకు ఈ రాయితీ వర్తిస్తుంది. అదే విధంగా ఒకేసారి ఫ్యామిలీ మొత్తానికి(నలుగురికి) టికెట్స్ తీసుకుంటే ఛార్జీలపై 5 శాతం డిస్కౌంట్ కల్పిస్తుంది. దీంతో పాటు ఈ-వాలెట్ ద్వారా చేసుకునే టికెట్ బుకింగ్ లకూ రాయితీ వర్తిస్తుందని అధికారులు తెలిపారు. జనవరి 6 నుంచి 18వ తేదీ వరకు స్పెషల్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. ఈ సీజన్లో మొత్తం 6400 ప్రత్యేక బస్సుల్ని నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. స్పెషల్ బస్సులలో కూడా సాధారణ బస్సుల ఛార్జీలు వసూలు చేయడంతో పాటు అదనంగా రాయితీని అమలు చేయనున్నట్లు తెలిపారు. సంక్రాంతి పర్వ దినానికి హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే ఏపీ వాసుల కోసం ప్రత్యేక బస్సులు నడిపేందుకు రెండు రాష్ట్రాల ఆర్టీసీలు రంగం సిద్ధం చేశాయి.