దిశ నిందితుల ఎన్‌కౌంటర్ బూటకం.. సిర్పూర్కర్ కమిషన్ - MicTv.in - Telugu News
mictv telugu

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ బూటకం.. సిర్పూర్కర్ కమిషన్

May 20, 2022

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ బూటకమే అని సిర్పూర్కర్ కమిషన్ నివేదిక వెల్లడించింది. సుప్రీం ఆదేశాలతో కమిషన్ న్యాయవాది.. వాద ప్రతివాదులకు కమిషన్ రిపోర్ట్ అందజేశారు. 387 పేజీలతో కూడిన ఈ నివేదికలో కీలక విషయాలు పొందుపరిచారు కమిషన్ సభ్యులు. తక్షణ న్యాయం కోసమే ఎన్‌కౌంటర్ అని స్పష్టం చేశారు. నిందితులు ఎదురుకాల్పుల్లో మరణించారన్న పోలీసుల వాదన నమ్మశక్యంగా లేదని కమిషన్ తెలిపింది. పోలీసులపై హత్యా నేరం కింద విచారణ జరపాలని, మొత్తం 10 మంది పోలీసులపై విచారణ జరపాలని చెప్పింది. పోలీసులు వి.సురేందర్, కె.నర్సింహారెడ్డి, షేక్‌లాల్ మాధర్‌, మహ్మద్ సిరాజుద్దీన్, కొచ్చెర్ల రవి, కె.వెంకటేశ్వర్లు, ఎస్.అర్వింద్‌గౌడ్‌, డి.జానకిరాం, ఆర్.బాలూ రాథోడ్, డి.శ్రీకాంత్‌ను విచారించాలని సూచించింది. కమిషన్ తీర్పుతోనైనా ఇప్పటికైనా తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఎన్‌కౌంటర్‌కు గురైన మృతుల కుటుంబసభ్యులు ఆశిస్తున్నారు.

తెలంగాణ హైకోర్టుకు బదిలీ

అంతకుముందు ఈ ఎన్‌కౌంటర్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీజేఐ ఎన్వీ రమణ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసుపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలంగాణ హైకోర్టే నిర్ణయిస్తుందని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. ఈ కేసును సుప్రీంకోర్టు ప్రత్యేకంగా మానిటర్‌ చేయలేదని.. తదుపరి విచారణ, తీసుకునే చర్యలను హైకోర్టు నిర్ణయిస్తుందని చెప్పింది.
అలాగే ఈ ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ విలాస్‌ సిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదికను బహిర్గతం చేయొద్దన్న తెలంగాణ ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది ‘‘హైకోర్టు, కింది స్థాయి కోర్టులో ఏం జరుగుతుందో తెలియదు. మేం సిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదిక పంపుతాం.. దీనిపై హైకోర్టే నిర్ణయం తీసుకుంటుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యవహారమిది. నివేదిక చూడకుండా కేసులో వాదనలు వినడం.. కేసును సుప్రీంకోర్టు నేరుగా పరిశీలించడం సాధ్యంకాదు.’’ అని ధర్మాసనం సూచించింది. మరోవైపు ఈ విచారణకు నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగిన సమయంలో సైబరాబాద్‌ సీపీగా వ్యవహరించిన వీసీ సజ్జనార్‌ హాజరయ్యారు.