దిశ నిందితుల మృతదేహాలు భద్రపరచాలి.. సుప్రీంకోర్టు - MicTv.in - Telugu News
mictv telugu

దిశ నిందితుల మృతదేహాలు భద్రపరచాలి.. సుప్రీంకోర్టు

December 12, 2019

Disha Incident

దిశ హత్యకేసు నిందితుల మృతదేహాలపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు మృతదేహాలు భద్రపరచాలని ఆదేశాలు జారీచేసింది. మృతదేహాల అప్పగింతపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని స్పష్టంచేసింది. మృతదేహాల అప్పగింతపై తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాదుల ధర్మాసనం దృష్టికి తేవడంతో ఈమేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించింది. 

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు జరిపేందుకు సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో విచారణ కమిషన్‌ ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వీఎస్‌ సిర్పుర్కర్‌ నేతృత్వంలోని ఈ కమిషన్‌లో సీబీఐ మాజీ డైరెక్టర్‌ కార్తికేయన్‌, ముంబయి హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రేఖ సభ్యులుగా ఉన్నారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు నిందితుల మృతదేహాల అప్పగింత అంశంపై హైకోర్టులో గురువారం (డిసెంబర్ 12) విచారణ జరిగింది. ఎన్‌కౌంటర్‌పై విచారణకు సుప్రీంకోర్టు కమిషన్‌ను ఏర్పాటు చేసిందని, అన్ని ఇతర విచారణలపై స్టే విధించిందని ఈ సందర్భంగా హైకోర్టు వెల్లడించింది. కాగా, మృతదేహాలు అప్పగించాలన్న పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో సందిగ్దతకు తెరపడింది.