Disruption in Vinayaka immersion...seven people died
mictv telugu

వినాయక నిమ‌జ్జ‌నంలో అప‌శృతి..ఏడుగురు మృతి

September 10, 2022

దేశవ్యాప్తంగా వినాయక నిమజ్జన వేడుకలు ఆయా రాష్ట్రాల్లో అంగరంగా వైభవంగా జరుగుతున్నాయి. ఈ నిమజ్జన వేడుకల్లో ఎటువంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా ఆయా రాష్ట్రాల పోలీసులు కఠినంగా చర్యలు తీసుకుంటున్నారు. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో శుక్రవారం రోజునే గణేశ్ నిమజ్జన వేడుకలు జరిగాయి. అయితే, హర్యానా రాష్ట్రంలో వినాయక నిమజ్జనాల్లో పెను విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నీళ్లలో పడి ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని సోనిపట్‌లో నిమజ్జనం చేస్తూ, ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మహేంద్రగఢ్‌లో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. నిమజ్జనం సందర్భంగా సమీపంలోని చెరువులు, నదుల వద్ద ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. సోనిపట్‌లోని మిమార్పూర్ ఘాట్ వద్ద నిమజ్జనానికి కుమారుడు, మేనల్లుడితో కలిసి వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మరణించాడు. మహేంద్రగఢ్‌ సమీపంలోని ఓ గ్రామంలో ఉన్న కాలువలో గణేశ్ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా 9 మంది కొట్టుకుపోయారు.

విషయం తెలుసుకున్న అధికారులు..వారి కోసం గాలింపు చర్యలు చేపట్టి, అర్ధరాత్రి సమయంలో 8 మందిని వెలికి తీశారు. వీరిలో నలుగురు మృతి చెందారు. ఈ ఘటనపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ఆవేదన చెందారు. అనంతరం ఆయా కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. నీటిలో మునిగిపోయిన ఎంతోమందిని ఎన్డీఆర్ఎఫ్ దళాలు రక్షించాయని, బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.