‘మా’లో గడబిడ.. నరేష్ వర్సెస్ రాజశేఖర్? - MicTv.in - Telugu News
mictv telugu

‘మా’లో గడబిడ.. నరేష్ వర్సెస్ రాజశేఖర్?

September 11, 2019

Naresh vs. Rajasekhar.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌‌పై సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలపై మా అధ్యక్షుడు నరేష్ ఘాటుగా స్పందించారు. కార్యవర్గంలో భేదాభిప్రాయాలు వచ్చాయని, అధ్యక్షుడు నరేష్‌కు రాజశేఖర్ కార్యవర్గం నోటీసులు ఇచ్చారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన మండిపడ్డారు.  రాజశేఖర్, నరేష్ మధ్య ఆధిపత్య పోరు జరుగుతోందని.. ఇటీవల 20 మంది మా సభ్యులతో రాజశేఖర్ అధ్యక్షతన సమావేశం జరగడం ఈ వివాదానికి బలం చేకూరిందని వార్తలు వినిపించాయి. 

ఈ విషయాన్ని ‘మా’ కార్యనిర్వాహక వర్గం కూడా తీవ్రంగా ఖండించింది. ‘అసోసియేషన్ అన్నప్పుడు సవాలక్ష సమస్యలు వుంటాయి. వాటన్నింటినీ అందరూ చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ‘మా’ అభివృద్ధికి సంబంధించి అత్యవసరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి మంగళవారం ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది. అసోసియేషన్‌కు సంబంధించి మీడియాకు తెలియజేయాల్సిన వార్తలు ఏవైనా ఉంటే అధికారికంగా మేమే ప్రకటిస్తాం’ అని ‘మా’ కార్యవర్గం స్పష్టం చేసింది. 

ఇదిలావుండగా తెలంగాణ ప్రభుత్వానికి వ్యాపార ప్రకటనలు ఇచ్చేందుకు ఉపయోగించిన రూ.750000 దుర్వినియోగమైనట్టు మరో వార్త కూాడా విస్తృతంగా ప్రచారం అవుతోంది. అయితే ఈ ఆరోపణపై ఎలాంటి సమాచారం బయటకు రాకుండా మా యూనియన్ చర్యలు తీసుకుంటోంది. ఇలాంటి మరికొన్ని నిధుల వ్యయాలు గురించి సంఘంలో అసంతృప్తి వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది.