Distribution of notes as Prasad at Kanpur Ammavari Temple
mictv telugu

అమ్మవారి ప్రసాదంగా నగదు పంపిణీ.. ఎక్కడంటే

October 24, 2022

ఎక్కడైనా దేవాలయాల్లో భక్తులకు లడ్లు, పులిహోర, దద్ధోజనం, పొంగళి వంటివి ప్రసాదంగా ఇస్తారు. కానీ, నగదును ప్రసాదంగా ఇచ్చే ఓ చోటు ఉందని తెలుసా? ఇది నిజంగా జరుగుతోంది. అలా ఒకసారి కాదు ప్రతీఏటా దర్శనానికి వచ్చే భక్తులకు నగదు పంపిణీ చేస్తారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ నగరమైన కాన్పూర్‌లో ఈ విధంగా డబ్బులు పంపిణీ చేస్తారు. దీపావళి సందర్భంగా స్థానికంగా ఉండే పర్మత్ ఆలయ సముదాయంలోని వైభవ లక్ష్మీ అమ్మవారి దర్బారును ప్రతీఏటా ధన్ తేరాస్ పండుగ నాడు నోట్లతో అలంకరిస్తారు. ఏడాది పొడవునా భక్తులు దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారు. ఈ సందర్భంలో తమకు తోచినంత నగదును అమ్మవారికి సమర్పిస్తారు. ధన్‌తేరాస్ రోజున ఈ మొత్తాన్ని జమ చేసి అమ్మవారికి ఆ నోట్లతో అలంకరిస్తారు. ఈ అలంకారంతో అలరారే అమ్మవారిని చూడడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు.

ఈ ఏడాది కూడా ధన్ తేరాస్ సందర్భంగా లక్ష్మీదేవీని రూ. 5 లక్షల 51 వేల నోట్లతో అద్భుతంగా అలంకరించారు. అయితే ఈ సారి మాత్రం గతేడాది కంటే నోట్ల సంఖ్య తగ్గింది. రేపు రాబోయే గ్రహణం కూడా ఓ కారణమంటున్నారు భక్తులు. అమ్మవారికి అలంకరించిన డబ్బులో కొంత ప్రసాదంగా పంచుతామని ప్రధాన పూజారి మహంత్ జితేంద్ర మోహన్ బాజ్‌పేయి తెలిపారు. అలంకరించిన డబ్బును ప్రతీ ఏడాది ప్రసాదంగా పంపిణీ చేస్తామని చెప్పారు. ఆ డబ్బును ఇంట్లో ఉంచడం ద్వారా ఆనందం, శ్రేయస్సు కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారని చెప్పారు. ఇలాంటి పద్ధతి దేశంలో ఎక్కడా లేదని, కేవలం వైభవ్ లక్ష్మీమాత ఆలయంలోనే జరుగుతుందని ప్రధాన పూజారి వెల్లడించారు. కోరిన కోరికలు నెరవేర్చే కొంగు బంగారంగా అమ్మవారు పూజలందుకుంటున్నారు.