బాణసంచాపై నిషేధం.. కాల్చినా, అమ్మినా లక్ష జరిమానా..  - MicTv.in - Telugu News
mictv telugu

బాణసంచాపై నిషేధం.. కాల్చినా, అమ్మినా లక్ష జరిమానా.. 

November 6, 2020

Diwali fireworks crackers Delhi government

దీపావళి పండగకు దేశప్రజలు సిద్ధమవుతున్నారు. కరోనా కష్టాల కొలిమిలోంచి పూర్తిగా బయటపడకున్నా పండగ పండగే కదా అంటున్నారు. అయితే ఇప్పటికే కాలుష్య, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న రాష్ట్రాలు మాత్రం ఆంక్షల బాంబులు పేలుస్తన్నాయి. రాష్ట్ర ప్రజలు బాణసంచా కాల్చితే సమస్యలు వస్తాయంటూ ఢిల్లీ ప్రభుత్వం ఏకంగా నిషేధమే తీసుకొచ్చిది. బాణసంచా అమ్మినా, కాల్చినా రూ. లక్ష జరిమాన పడుతుందని హెచ్చరించింది. ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసమే పటాకులపై నిషేధం పెట్టామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ నెల 7 నుంచి 30 వరకు అన్ని పటాసులపై నిషేధం అమలులో ఉంటుదని వివరించారు. 

నిందితులపై వాయు కాలుష్య నివారణ, నియంత్రణ చట్టం 1981 కింద కేసులు పెడతామని రాష్ట్ర పర్యావరణ మంత్రి గోపాల్‌ రాయ్‌ వెల్లడించారు. దీపావళి నేపథ్యంలో కాలుష్య నియత్రణపై ఆయన  ఈ రోజు సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. తర్వాత నిషేధం ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే కరోనా కేసు విజృంభిస్తున్నాయని, పండగల వల్ల జనం ఒకచోటు గుడికూడితే మరింత ప్రమాదమని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. మరోపక్క.. ఒడిశా, రాజస్తాన్ రాష్ట్రాలు కూడా ఇప్పటికే బాణసంచా విక్రయాలపై నిషేధం విధించాయి. హరియాణాలో  పాక్షికంగా నిషేధం అమల్లోకి వచ్చింది. బాణసంచాలో సీసం, గంధకం, మెగ్నీషియం, నైట్రేట్, జింక్ వంటి రసాయనాలు వల్ల ఆరోగ్య సమస్యలు ప్రబలే అవకాశం ఉండడం, కరోనా రోగులతో కాంటాక్టులో ఉండే వృద్ధులు, పిల్లలకు అవి ప్రాణాంతకంగా మారే అవకాశముండడంతో బాణసంచాకు దూరంగా ఉండాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి.