దుబాయ్‌లో దీపావళి.. జనగణమన ఆలపించిన పోలీసులు.. - MicTv.in - Telugu News
mictv telugu

దుబాయ్‌లో దీపావళి.. జనగణమన ఆలపించిన పోలీసులు..

October 24, 2019

ఈసారి కూడా దుబాయ్‌ పోలీసు బ్యాండ్ భారత జాతీయ గీతం జనగణమనను ఆలపించడం భారతీయుల మదిని దోచుకుంది. దీపావళి సందర్భంగా వారు తమ వాద్యాలతో ఎంతో హృద్యంగా జాతీయగీతాన్ని ఆలపించిన తీరు ఆహూతులను ఆకట్టుకుంది. దుబాయ్‌లో భారతీయులు అనేక హోదాల్లో, అనేక రంగాల్లో తమ సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. దుబాయ్, భారత్ మధ్య ఎన్నో దశాబ్దాలుగా సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది దుబాయ్‌లో దీపావళి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తుంటారు. పది రోజుల పాటు ఈ వేడుకలు జరుగుతాయి. 

ఈ ఏడాది కూడా దుబాయ్‌లో దీపావళి సంబరాలు ఘనంగా మొదలయ్యాయి. బాలీవుడ్‌ గీతాలు, బాంగ్రా నృత్యాలతో వేడుకలు అట్టహాసంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో దుబాయ్ పోలీసు బ్యాండ్ భారత జాతీయ గీతం జనగణమనను ఎంతో హృద్యంగా పలికించారు. దుబాయ్‌లోని హాతీస్ గార్డెన్‌లో ఈ వేడుకలు జరిగాయి. దుబాయ్‌లో భారత రాయబార కార్యాలయం సహకారంతో దుబాయ్ టూరిజం విభాగం ఈ కార్యక్రమం నిర్వహించింది. దుబాయ్‌ ఫెస్టివల్స్‌ అండ్‌ రిటైల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌(డీఎఫ్‌ఆర్‌ఈ), దుబాయ్‌ పోలీసులు, భారత కాన్సులేట్‌ అధికారులు, మీరాస్‌ అల్‌ సీఫ్‌ వాటర్‌ఫ్రంట్ ప్రమేనడాలు సంయుక్తంగా జరుపుతున్నారు.