Diwali to be a public school holiday in New York City from next year
mictv telugu

దీపావళి ఇక సెలవు రోజు.. న్యూయార్క్ మేయర్

October 21, 2022

భారతీయుల ముఖ్య పండుగ దీపావళిని ఇకపై న్యూయార్క్ వాసులు సైతం జరుపుకోనున్నారు. దీపావళి పండుగకి ఆ నగరంలో ప్రాముఖ్యత దక్కింది. ఇకపై దీపావళిని పబ్లిక్ హాలిడే గా ప్రకటించనున్నామని న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ప్రకటించారు. ఈ విషయంపై ఎన్నోరోజలుగా చర్చ జరిగిందని, పెండింగ్ లో ఉన్న దీనిపై తగిన నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. వచ్చే ఏడాది అంటే 2023 నుంచి న్యూయార్క్ నగరంలో దీపావళిని అధికారిక సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. తద్వారా న్యూయార్క్ పట్టణ ఏకత్వంపై సందేశం ఇచ్చినట్టు అయిందన్నారు. పిల్లలు దీపావళి గురించి నేర్చుకునేందుకు ప్రోత్సాహం ఇస్తుందన్నారు. స్కూల్ కేలండర్ లోని యానివర్సరీ డేను దీపావళి కోసం కేటాయించారు. యానివర్సరీ డేను ఏటా జూన్ మొదటి గురువారం అక్కడ నిర్వహిస్తుంటారు.

‘‘భారతీయ అమెరికన్ కమ్యూనిటీ నుంచి ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న డిమాండ్ ఇది. దీపావళిని పబ్లిక్ హాలిడేగా ప్రకటించడం న్యూయార్క్ పట్టణ వైవిధ్యం, బహుళత్వానికి బలమైన సందేశం ఇచ్చినట్టు అవుతుంది. అన్ని వర్గాల ప్రజలు సంబరాలు చేసుకోవడానికి, భారతీయ తత్వం, వారసత్వాన్ని అనుభవించడానికి అవకాశం కల్పిస్తుంది’’ అని న్యూయార్క్ కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియా రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. న్యూయార్క్ లోని హిందూ, బుద్ధిస్ట్, సిఖ్, జైన్ మతాలకు చెందిన 2 లక్షల మంది దీపావళి వేడుకలను గుర్తించే సమయం ఆసన్నమైనట్టు న్యూయార్క్ అసెంబ్లీ సభ్యుడు జెనీఫర్ రాజ్ కుమార్ ప్రకటించారు.