భార్య మరణంతో కుంగుబాటుకు గురైన ఆ పెద్దాయనకు 91 ఏండ్ల వయస్సులో మరో తోడు దొరికింది. జీవితంలో ఎన్ని ఉన్నా.. ఓ భాగస్వామి లేని లోటు ఎవరూ తీర్చలేదని… తన భార్య కోరిక మేరకు మరో మహిళను తన జీవితంలోకి ఆహ్వానించినట్లు చెప్పారు ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజం, డీఎల్‌ఎఫ్ ఛైర్మన్ కేపీ సింగ్. 65 ఏళ్ల తమ వైవాహిక బంధంలో తన భార్య ఇందిర 2018లో ఒంటరిని చేసి వెళ్లిపోయిందని , ఆమె మరణం తనను ఎంతో కుంగదీసిందన్నారు. ఈ లోకం నుంచి వెళ్లిపోతూ.. తన జీవితాన్ని యథావిధిగా కొనసాగించాలని తన దగ్గర ఓ మాట తీసుకుందని అన్నారు. ఆమె కోరిక మేరకు ఇన్నాళ్లకు తనకు ఓ తోడు దొరికిందని.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రకటించారు కేపీ సింగ్.
క్యాన్సర్ బారిన పడిన తన భార్యను బతికించుకోడానికి సర్వశక్తులా ప్రయత్నించానని చెప్పారు. 65 ఏళ్ల వివాహ బంధం తర్వాత భార్యను కోల్పోతే గతంలో మాదిరి ఉండలేరు. అందుకే నా జీవితాన్ని మార్చుకోవడానికి ఇన్నాళ్లకు నాకో తోడు దొరికిందని కేపీ సింగ్ ఓ ప్రకటనలో వివరించారు. ఆమె పేరు షీనా. ఆమె చాలా చురుకైనదని, తనను ఎప్పుడూ ఉత్సాహంగా ఉంచుతుందన్నారు.
భార్య మరణం తర్వాత నుంచి కంపెనీ యాజమాన్యంలో చురుకైన పాత్ర వహించలేక యాజమాన్య బాధ్యతలు కుమారుడికి అప్పగించానని చెప్పారు. కాగా కేపీ సింగ్ మామగారు స్థాపించిన డీఎల్‌ఎఫ్‌లో 1961లో ఆయన చేరారు. దాదాపు 5 దశాబ్దాలపాటు కంపెనీలో వివిధ హోదాల్లో పనిచేసి, 2020లో ఛైర్మన్‌గా పదవీవిరమణ చేశారు. కేపీ సింగ్ ఆస్తి విలువ రూ.66 వేల కోట్లు. సింగ్ భార్య క్యాన్సర్‌తో మరణించారు.