ఆ పార్టీలో విషాదం.. 24 గంటల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు మృతి.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆ పార్టీలో విషాదం.. 24 గంటల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు మృతి..

February 28, 2020

DMK MLA.

తమిళనాడు ప్రధాన విపక్షంలో విషాదం నెలకొంది.  24 గంటల్లోనే డీఎంకేకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు చనిపోవడం పార్టీ శ్రేణుల్లో కలకలం రేపింది. గుడియాథం నియోజక వర్గానికి చెందిన ఎస్.కథవరాయణ శుక్రవారం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో మృతిచెందారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కథావరయణ్ వేలూరు జిల్లాలోని గుడియథం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అలాగే డీఎంకే పార్టీకి చెందిన మరో నేత, తిరువత్తియూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేపీపీ స్వామి గురువారం కన్నుమూశారు. ఎమ్మెల్యేల మృతిపట్ల వివిధ పార్టీ నేతలు సంతాపం ప్రకటించారు. ఇద్దరు గొప్ప నేతలను పార్టీ కోల్పోయిందని డీఎంకే శ్రేణులు ఆవేదన వ్యక్తంచేశారు. 

కేపీపీ స్వామి తిరువత్తియూరు నియోజకవర్గం నుంచి 2006 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది మత్స్యశాఖ మంత్రిగా పనిచేశారు. 2011 ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి కుప్పన్‌ చేతిలో ఓడిపోయారు. 2016 నాటి ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. డీఎంకే అగ్రనేత కరుణానిధితో ఆయనకు సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి. కేపీపీ స్వామి భార్య, మాజీ కౌన్సిలరైన ఉమ, పెద్ద కుమారుడు ఇనియవన్‌ కొంతకాలం క్రితం మరణించారు. కాగా, శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు పట్టినత్తార్‌ ఆలయం వీధి సమీపంలోని శ్మశానవాటికలో స్వామి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. స్వామి మరణంతో అసెంబ్లీలో డీఎంకే బలం 99కి తగ్గింది. కాగా, మత్స్యకార సామాజికవర్గానికి స్వామి ఎనలేని సేవలు చేశారని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ అన్నారు. కేవీకుప్పంలోని స్వామి భౌతికకాయానికి ఆయన నివాళులర్పించారు. స్వామి మరణం తనను ఎంతో కలచివేసిందని తెలిపారు. గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌, స్వామి మరణంపై ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు.