మావోయిస్టుల్లో కలిసిపోతా.. పోలీసులు గుండుకొట్టిన దళితుడి వార్నింగ్ - MicTv.in - Telugu News
mictv telugu

మావోయిస్టుల్లో కలిసిపోతా.. పోలీసులు గుండుకొట్టిన దళితుడి వార్నింగ్

August 10, 2020

Do join the Maoists .. Warning of the Dalit youth who was head tonsured by the police .

మావోయిస్టుల్లో ఉన్నవారే జనజీవన స్రవంతిలో కలిసిపోతామని చెబుతున్న క్రమంలో.. ఓ దళిత యువకుడు మాత్రం జనజీవన స్రవంతిలోంచి మావోయిస్టుల్లో కలిసిపోతానని చెప్పి షాక్ ఇచ్చాడు. తనను గుండు కొట్టి అవమానించిన పోలీసులపై చర్యలు తీసుకోకపోతే మావోయిస్టుల్లో కలిసిపోతానని ఏకంగా రాష్ట్రపతికే లేఖ రాశాడు. అతను ఎవరో ఇప్పటికే మీకు అర్థం అయి ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లాలో దళిత యువకుడికి పోలీస్ స్టేషన్‌లోనే శిరోముండనం చేసిన ఘటన గుర్తుకు వచ్చింది కదూ. ఆ ఘటన ఎన్ని వివాదాలకి కారణం అయిందో తెలిసిందే. తూర్పుగోదావరిలోని రాజమండ్రి రూరల్ సీతానగరం మండలం వెదుళ్లపల్లి గ్రామంలో ఇసుక రేవుల వద్ద రాజుకున్న ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా మారి చివరికి రాష్ట్రపతి, మావోయిస్టుల వరకు దారితీసింది. 

ఇసుకను తీసుకెళ్తున్న లారీలను అతివేగంగా నడుపుతున్నారని, దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామానికి చెందిన దళిత యువకులు కొందరు లారీలను ఆపారు. అదే వారు చేసిన మహా పాపం అయిపోయింది. ఈ విషయం తెలుసుకున్న అధికార పార్టీకి చెందిన నాయకుడు ఒకరు సంఘటన స్థలానికి వచ్చి కారుతో యువకులను ఢీ కొట్టేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో అతని కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే యువకులే దాడి చేసి తమ అద్దాలు ధ్వంసం చేశారని ఆరోపిస్తూ సదరు నేత సీతానగరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.‌ వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లి దళిత యువకుడు వరప్రసాద్‌‌ను స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఏమైందో గానీ.. ట్రైనీ ఎస్సై అతనికి శిరోముండనం చేశారు. దీంతో ఎస్సై సస్పెన్షన్ వేటుకు గురయ్యాడు. ఈ క్రమంలో తనకు  న్యాయం చేయాల్సిందిగా సదరు బాధితుడు వరప్రసాద్, రాష్ట్రపతికి లేఖ రాశాడు. తనను శిరోమండనం చేసిన కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశాడు. అలా కుదరకపోతే తాను మావోయిస్టుల్లో కలిసిపోవడానికి తనకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రపతిని కోరాడు. చూడాలి మరి వరప్రసాద్ లేఖపై రాష్ట్రపతి ఎలా స్పందిస్తారో.