మందు కొంటే రేషన్ ఇవ్వొద్దు.. రష్మీ - Telugu News - Mic tv
mictv telugu

మందు కొంటే రేషన్ ఇవ్వొద్దు.. రష్మీ

May 5, 2020

Do not give ration if you buy the Liquor.. Rashmi

దేశవ్యాప్తంగా గ్రీన్ జోన్లలో మద్యం అమ్మకాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో మందుబాబులు ఎగబడ్డారు. మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా మందుకోసం పోటీలు పడ్డారు. ఈ క్రమంలో కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దెబ్బతో దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరగడం ఖాయం అంటున్నారు. తాజాగా జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్.. లిక్కర్‌కి డబ్బులున్నాయి కానీ, తిండికి లేవా అని తనదైన శైలిలో ట్వీట్లలో మండిపడింది. మందు కొంటే రేషన్ ఇవ్వొద్దని చెప్పింది మరో ట్వీట్‌లో చెప్పుకొచ్చింది. ‘మే 4 తరవాత లిక్కర్ షాప్‌లకు వస్తున్న ప్రతి ఒక్కరికీ ఎన్నికల్లో మాదిరిగా చెరిగిపోని ఇంక్‌తో మార్కింగ్ వేయాలి. ఇలాంటి వ్యక్తులు ఉచిత ఆహారానికి కానీ, ప్రభుత్వం లేదంటే ఇతరుల ద్వారా అందుతున్న ఉచిత సరుకులకు కానీ అర్హులు కారు. వారి రేషన్‌ను కూడా ఆపేయాలి. మద్యం కొనుగోలు చేయడానికి అతని వద్ద డబ్బు ఉన్నప్పుడు, ఉచితంగా ఎందుకు ఇవ్వాలి? జోన్ల విభజన జరిగిన తరవాత లిక్కర్ ఒక్కటే పరిష్కరించాల్సిన సమస్య కాదు’ అంటూ రష్మీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిందించడం పరిష్కారం కాదని.. అన్నీ వ్యాపారాలను తిరిగి ప్రారంభించాలని కోరింది. నిరంతర లాక్‌డౌన్ వల్ల ఒక దేశం మనుగడ సాగించలేదని స్పష్టంచేసింది. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ వచ్చేంత వరకు మనం పరిస్థితిని అర్థం చేసుకుని దానికి తగ్గుట్టుగా నడుచుకోవాలంది. ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సూచించింది. కాగా, రష్మీ ట్వీట్లపై నెటిజన్లు స్పందించారు. రష్మీ అభిప్రాయాలతో ఏకీభవించారు.