ఏపీలో ఇంటర్వ్యూలు వద్దు - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో ఇంటర్వ్యూలు వద్దు

March 30, 2022

htbtf

ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగాలకు మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ )ను నిర్వహించాలని గతకొన్ని రోజులుగా పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, ఏపీపీఎస్సీ సభ్యులు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. స్పందించిన వైసీపీ ప్రభుత్వం.. వారి వాదనను తిరస్కరించింది. రాబోయే ప్రభుత్వ ఉద్యోగాలకు మౌఖిక పరీక్ష లేకుండానే ఉద్యోగాలను భర్తీ చేయాలని స్పష్టం చేసింది. దీంతో ఏపీపీఎస్సీ అధికారులు ఏ విధంగా ఇంటర్వ్యూలను నిర్వహించాలి? ఏ పద్ధతి మంచిది? ఏ ప్రకారం సరైన అభ్యర్ధులను ఎంపికచేయాలి అనే వాటిపై అధ్యయనం చేస్తున్నారు.

అయితే, ప్రభుత్వం నామినేట్ చేసిన ఏపీపీఎస్సీ సభ్యులు మాత్రం.. “ఉద్యోగాలను భర్తీ చేయాలంటే అభ్యర్థులను మేం ఇంటర్వ్యూ చేయాల్సిందే. ఇంటర్వ్యూ బోర్డులు ఏర్పాటు చేసి, అభ్యర్ధుల తెలివి తేటలను, వారి మానసిక సామర్థ్యాన్ని పరిశీలించి ఎంపిక చేయాల్సిందే” అంటూ ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏపీపీఎస్సీలో ఉన్న సభ్యులంతా దాదాపు అధికార పార్టీ సభ్యులు కావడం గమనార్హం. ఉద్యోగాలు ఇవ్వాలంటే మేం ఇంటర్వ్యూలు చేయాల్సిందేనంటూ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపడం ఆసక్తికర చర్చకు తావిస్తోంది.

మరోపక్క ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా జరిగే ఉద్యోగ నియామకాలకు ఇంటర్వ్యూలు ఉండబోవని 2021 జూన్ 20న సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీకి, ప్రభుత్వానికి మధ్య కొన్ని ఉత్తర, ప్రత్యుత్తరాలు సాగాయి. తాజాగా ఈ నెల 21న ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రభుత్వ సాధారణ పరిపాలనశాఖకు లేఖ రాసి, ఉద్యోగాల భర్తీకి మౌఖిక పరీక్షలు (ఇంటర్వ్యూలు) నిర్వహించాలని బోర్డు సభ్యులతోపాటు, కొందరు పౌరులు విన్నవించారని, అందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.

దీనికి స్పందించిన.. సాధారణ పరిపాలన శాఖ అదనపు కార్యదర్శి మార్చి 28న ఏపీపీఎస్సీ కార్యదర్శికి లేఖ రాశారు. అందులో “ఉద్యోగాల భర్తీకి మరికొంత కాలంపాటు – ఇంటర్వ్యూలు వద్దు. కార్పొరేట్ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో నియమితులయ్యే వారి కోసం అనుసరిస్తున్న విధానాలు, ఇతర రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల పద్ధతులను పరిశీలించిన తర్వాతే రద్దు ఉత్తర్వులిచ్చాం. ఇంటర్వ్యూ బోర్డు సభ్యుల్లో పక్షపాత ధోరణి లేకుండా చూడటం పెద్ద సవాల్ గా ఉండటం, బయటి వ్యక్తుల ప్రమేయాన్ని నియంత్రించలేకపోవడం వంటి అంశాలను ప్రభుత్వం పరిశీలించాకే ఇంటర్వ్యూలు ఉండకూదని నిర్ణయించింది’ అని పేర్కొన్నారు.