చలికాలం వచ్చిందంటే చాలా ఎన్నో రోగాలు చుట్టుముడుతుంటాయి. ఈ కాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సీజన్ లో వచ్చే సమస్యలకు ఆహారమే కీలకం. వేడి వేడి ఆహారం తీసుకోవాలి. చల్లని పదార్థాలకు దూరంగా ఉండాలి. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలకు ఈ సీజన్లో చాలా సమస్యలు వస్తుంటాయి. జలుబు, దగ్గు ఇవి ఓ పట్టాన తగ్గవు. అయితే చలికాలంలో నల్లమిరియాలు, బెల్లం కలిపి తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
బెల్లం, నల్లమిరియాలు ఈ రెండింటిలోనూ ఎన్నో పోషకాలతోపాటు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటిని కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. బెల్లం, నల్లమిరియాల్లో వేడి చేసే లక్షణం ఉంటుంది. అందుకే చలికాలంలో ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
జలుబు, దగ్గు, గొంతు నొప్పికి:
జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఇవన్నీ ఇబ్బంది పెడుతుంటాయి. ఒకసారి వచ్చాయంటే..సులభంగా తగ్గవు. మూడు మిరియాలు, కొంచెం బెల్లం తీసుకుని ఈ రెండింటినీ కలిపి పేస్టుగా చేయాలి. ఈ పేస్టును ప్రతిరోజూ తీసుకున్నట్లయితే దగ్గు, జలుబు, గొంతునొప్పి తగ్గిపోతాయి. ఉదయం ఒకసారి మాత్రం తీసుకోవాలన్న విషయం గుర్తుంచుకోండి.
ముక్కులో నుంచి రక్తం కారుతుంటే.:
కొంతమందికి ముక్కులో నుంచి రక్తం కారుతుంటుంది. ఈ సమస్య తగ్గాలంటే..పెరుగులో కొంచెం బెల్లం, మిరియాల పొడి కలిపి తాగితే..ముక్కులో నుంచి రక్తం కారడం క్రమంగా తగ్గిపోతుంది. అంతేకాదు తలనొప్పిని కూడా తగ్గిస్తుంది. తలనొప్పిగా ఉన్నప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.
కీళ్లనొప్పులకు చెక్ :
నేటికాలంలో చాలామంది కీళ్లనొప్పులతో బాధపడుతున్నారు. కీళ్లనొప్పులు ఉన్నవారు ప్రతిరోజూ బెల్లం, మిరియాలు పొడిని తీసుకుంటే…ఉపశమనం కలుగుతుంది. మిరియాల్లో ఉండే లక్షణాలు..కీళ్ల నొప్పులు తగ్గించేందుకు సహాయపడతాయి. బెల్లం ఆర్గానిక్ అయితే మంచి ఫలితం ఉంటుంది.