మనశరీరంలో అన్నిరకాల విటమిన్లు ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం. ఒక్క విటమిన్ లోపం ఉన్నాకూడా శరీరంపై చెడు ప్రభావం చూపుతుంది. వీటిలో విటమిన్ బి 12 ఒకటి. విటమిన్ బి 12 మన శరీరానికి చాలా ముఖ్యమైన పోషకం. అధిక కొవ్వును శక్తిగా మారుస్తుంది. డీఎన్ఏ, ఎర్ర రక్త కణాలు ఈ విటమిన్ నుంచి తయారవుతాయి. ఇది శరీరంలోని నరాలకు ప్రొటీన్ ను కూడా అందిస్తుంది. ఈ విటమిన్ లోపించినట్లయితే మరణానికి కూడా దారి తీస్తుంది. అంతేకాదు ఈ విటమిన్ లోపం వల్ల అనేక వ్యాధులు బారిన పడతాం.
నాడీ వ్యవస్థకు విటమిన్ బి-12 అవసరం:
నాడీ వ్యవస్థ మన శరీరంలో చాలా సున్నితమైన భాగం. నాడీ వ్యవస్థకు విటమిన్ B-12 చాలా ముఖ్యమైనది. దీని లోపం వల్ల మెదడుకు నష్టం వాటిల్లుతుంది. B-12 లోపాన్ని ముందుగానే గుర్తించలేదు. శరీరంలో విటమిన్ బి 12 లక్షణాలు ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.
అలసట మరియు బలహీనత:
విటమిన్ B-12 లోపం కారణంగా, అలసట, బలహీనత ఉంటుంది. నిరంతరం శరీరం అలసిపోయినట్లు అనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. ఎందుకంటే విటమిన్ బి 12 లోపం వల్ల మనస్సు మొద్దుబారినట్లు, తొందరగా అలసిపోవడం, ఏ పనులపై శ్రద్ధ చూపించకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి.
రక్తం లేకపోవడం:
విటమిన్ B-12 లోపం కారణంగా, మీ శరీరంలో రక్తం తక్కువగా ఉంటుంది. ఇది భవిష్యత్తులో రక్తహీనతకు దారితీస్తుంది. అందుకే సకాలంలో చికిత్స పొందడం చాలా ముఖ్యం.
వేగవంతంగా గుండె కొట్టుకోవడం:
విటమిన్ B-12 లోపం కారణంగా, నడుస్తున్నప్పుడు కానీ లేదా ఏదైనా పని చేస్తున్నప్పుడు కానీ మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. అలాంటి పరిస్థితిలో ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే దాని ప్రభావం శరీరం మీద పడకముందే వైద్యున్ని సంప్రదించాలి.
ఊపిరి ఆడకపోవడం:
ఏదైనా పనులు చేస్తున్నప్పుడు విపరీతమైన అలసట లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నట్లయితే..మీ శరీరంలో విటమిన్ బి12లోపం ఉందని అర్థం. అందుకే సకాలంలో ఈ లక్షణాలను గుర్తించి చికిత్స తీసుకోవడం మంచిది.