Do you know how many times date of birth can be changed in Aadhaar card?
mictv telugu

ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చో తెలుసా?

August 29, 2022

ప్రతి మనిషికీ గుర్తింపు కోసం ప్రభుత్వం ఇచ్చిన కార్డు ఆధార్. ఇందులో తప్పులు పడితే సవరించుకునేందుకు అవకాశం ఉంటుంది. పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి వివరాలను సవరించుకోవచ్చు. అయితే కొన్ని విషయాల్లో పరిమితులు ఉన్నాయి. ప్రతీ ఆధార్‌కు మొబైల్ నెంబరు తప్పనిసరి కాగా, నెంబరు మారితే ఆధార్ డేటాబేస్‌లో అప్‌డేట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇందుకోసం సమీపంలోని ఆధార్ సెంటర్‌కు వెళ్లి వివరాలు ఇస్తే సరిపోతుంది. అలాగే ఈ మెయిల్ కూడా. వీటిని ఆన్‌లైన్లో సవరించుకునే వీలుండదు. ఇక పేరులో తప్పు దొర్లితే సవరించుకోవచ్చు. కాకపోతే రెండు సార్లు మాత్రమే ఆ అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కుదరదు. ఇలాగే పుట్టిన తేదీ కూడా. ఒకే ఒక్కసారి మాత్రమే పుట్టిన తేదీ మార్చుకోవడానికి అనుమతిస్తారు. రెండోసారి అంటే దానిని అసాధారణ కేసుగా పరిగణిస్తారు. రెండో సారి మార్చుకోవాలంటే ఆధార్ సెంటరుకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత మీ దరఖాస్తును రీజనల్ ఆఫీసుకు పంపిస్తారు. అక్కడ మీరు చెప్పే కారణాలు, వివరాలు వారికి సంతృప్తికరంగా ఉంటే సవరణ అభ్యర్ధనకు ఓకే చెప్తారు. లేదంటే లేదు. దీనిలాగే లింగ మార్పు వివరాలు కూడా. కేవలం ఒకే ఒక్కసారి సవరణకు అనుమతిస్తారు. రెండోసారి కోరితే పైన చెప్పిన ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది.