అరటి… ఇదొక అద్భుతమైన చెట్టు. మిగతా చెట్లు అన్నీ పువ్వులో, పళ్ళో ఇవ్వడం వరకే ఆగిపోతాయి. కానీ అరటిచెట్టులో మొత్తం అన్నీ ఉపయోగపడేవే. పళ్ళు, కాయలు, ఆకులు, కాండం అన్నీ పనికి వచ్చేవే. అరటి పళ్ళు గురించి అందరికీ తెలిసిందే. అలాగే దక్షిణ భారతదేశంలో అరటి ఆకులో భోజనం తినడం గురించి తెలియని వారు ఉండరు. ఏదో ఒక సందర్భంలో ప్రతీ ఒక్కరూ ఈ ఆకులో భోజనం చేసే ఉంటారు. మామూలుగా కంచంలో తినే అన్నానికి, అరటి ఆకులో తినే అన్నానికి రుచి తేడా ఉంటుంది. ఆకులో అన్నం భలే టేస్టీగా మారుతుంది. అంతేకాదు ఇలా అరటి ఆకులో భోజనం మన వంటికి కూడా చాలా మంచిది. దీని వల్ల ప్రయోజనాలు తెలుసుకునే ముందు అసలు అరటి ఆకులో తినడం ఎప్పుడు ప్రారంభమైందో చూద్దాం.
పూర్వం రాజులపై అధికారులపై ఎక్కువగా విష ప్రయోగాలు జరిగేవి. ఆ ప్రమాదాల నుంచి తప్పించుకునేందుకు అరటి ఆకులను విరివిగా ఆడేవారు. ముఖ్యంగా అన్నంలో విషపదార్థాలు కలిస్తే అరటిఆకు నల్లగా మారిపోతుంది. అలా మారిపోతున్నప్పుడు ఆ అన్నంలో విషంకలిపారని సులభంగా అర్థమైపోయేది.అలా అరటి ఆకులో భోజనం వాడుకలోకి వచ్చింది. ఇక దీని వల్ల కలిగే ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి.
వేడి వేడి అన్నం అరటి ఆకులో వడ్డించినప్పుడు అరటిఆకులో ఉండే రకరకాల పోషక పదార్థాలు ఆహారంలో కలవడం వల్ల ఆ ఆహారం మరింత రుచికరంగా తయారవుతుంది. అరటి ఆకులో భోజనం చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి ఆకలి పెరుగుతుంది. అదేవిధంగా అరటి ఆకు ప్లాస్టిక్ మాదిరిగా కాకుండా అత్యంత తేలికగా భూమిలో కలిసి పోతుంది. ప్లాస్టిక్ ప్లేట్లు, కవర్లు భూమిలో కలవాలంటే చాలా ఏళ్ళ సమయం పడుతుంది. దీంతో అరటి ఆకు పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.ఎన్నో రకాలయిన జబ్బులను నిరోధించే శక్తి ఈ ఆకులో ఉండటం విశేషం. ఇది కాన్సరు (మెదడు, ప్రోస్టేటు, సెర్వైకల్మ రియు బ్లాడర్), హెచ్.ఐ.వి , సిక్కా, పార్కిన్సన్ మొదలయిన వాటిని నిరోధించగలదు. రోగ నిరోధక శక్తిని కూడా పెంచగలదు. వాడి పారవేసిన ఆకులు మట్టిలో సులభముగా కలిసిపోయి నేలను సారవంతంగా మారుస్తాయి కాబట్టి పర్యావరణానికి కూడా మేలు చేస్తాయి.
జర్నల్ ఆఫ్ ఎథ్నిక్ ఫుడ్స్’లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం అరటి ఆకులను లోహ పాత్రలు ఉనికిలోకి రావడానికి ముందునుంచే ఉపయోగించారని తెలుస్తోంది. అరటి ఆకులు మందంగా, పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి. అందులోనూ ఇవి ఆహారం పెట్టినా చిరిగిపోవు.అరటి ఆకులలో సహజంగా పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి ఒక రకమైన యాంటీఆక్సిడెంట్లు. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే సాధారణ అనారోగ్యాలను నివారించడానికి కూడా సహాయపడుతాయి. ఆకులో వడ్డించిన ఆహారాన్ని తినడం వల్ల మన శరీరం పాలీఫెనాల్స్ ను శోషించుకుని రోగనిరోధక శక్తిని పెంచుతుందని నమ్ముతారు. అరటి ఆకులల్లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి మన ఆహారంలో ఉంటే సూక్ష్మక్రిములను చంపి ఫుడ్ ను స్వచ్ఛంగా మారుస్తుంది. ఇది ఒకరకంగా మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
సాధారణంగా మనం పాత్రలను క్లీన్ చేయడానికి సబ్బులను ఉపయోగిస్తాము. కానీ ఈ సబ్బులల్లో మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే రసాయనాలు ఉంటాయి. ఈ రసాయన అవశేషాలు గిన్నెలకు ఉండే అవకాశం ఉంది. కానీ అరటి ఆకులు సహజంగా మైనపు లాంటి పదార్ధంతో పూతను కలిగి ఉంటాయి. ఇది ఆహారాన్ని దాని ఉపరితలానికి అంటుకోకుండా నిరోధిస్తుంది. అందుకే అరటి ఆకులు చాలా పరిశుభ్రమైనవి. అంతేకాదు మెటల్,గాజు ప్లేట్లతో పోలిస్తే ఇవి మరింత చవకైనవి కూడా.