నిమ్మకాయల ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా? - MicTv.in - Telugu News
mictv telugu

నిమ్మకాయల ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా?

April 25, 2022

ఈ మధ్య పెళ్లిళ్లలో నూతన వధూవరులకు ఒక స్నేహితుడు నిమ్మకాయలు గిఫ్ట్‌గా ఇచ్చిన వార్త వచ్చింది. అతను సరదాగా ఆ పని చేసినా.. అసలు ఎన్నడూ లేనంతగా ఈ సంవత్సరం ధరలు ఎందుకు పెరిగాయో కారణాలు తెలుసుకుందాం.

1. వేసవి తొందరగా ప్రారంభం కావడం : గత కొన్ని ఏళ్లుగా చూస్తే ఈ సారి ఎండలు కాస్త తొందరగా ముదిరాయి. దాంతో వేడి పెరగడంతో నిమ్మకాయలకు ముందుగానే గిరాకీ ప్రారంభమైంది. ఇంకోవైపు డిమాండుకు సరిపడా సరఫరా లేకుండా పోయింది.

2. వాతావరణ సమస్యలు : ఈ ఏడాది తుఫానులు, అధిక వర్షాల వల్ల పంట బాగా దెబ్బతిన్నది. మన తెలుగు రాష్ట్రాలతో పాటు నిమ్మ ఎక్కువగా ఉత్పత్తి చేసే గుజరాత్ వంటి ప్రాంతాలలో నిమ్మ రైతులు బాగా నష్టపోయారు. ఉత్పత్తి తగ్గిపోవడంతో సరఫరా తగ్గింది.

3. చమురు ధరల్లో పెరుగుదల : గత రెండేళ్ల నుంచి చూస్తే పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దాంతో రవాణాపై ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. దీంతో తప్పనిసరిగా ధరలు పెరిగాయి.

4. కోల్డ్ స్టోరేజీ సౌకర్యాల లేమి : ఉత్పత్తి అయిన నిమ్మ పంటను దాచుకునేందుకు స్టోరేజ్ సదుపాయం లేనందువల్ల సీజన్‌లో నిమ్మకాయలు దొరకడం లేదు. నిల్వ సామర్ధ్యం, సౌకర్యాలు ఉంటే డిమాండుకు తగ్గట్టు కాయలను సరఫరా చేయడానికి వీలుండేది.
అంతేకాక, మళ్లీ నిమ్మకాయలు మార్కెటుకు వచ్చే జూన్ వరకు ఇలాంటి పరిస్థితే ఉంటుందని వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు. మళ్లీ పంటకోత వరకు వేచి చూడాలని, లేకుంటే చమురు ధరలు తగ్గినా నిమ్మ కాయల ధరలు తగ్గుతాయని ట్రేడర్లు అభిప్రాయపడుతున్నారు.