కరోనా వార్డులో డ్యూటీ..  డాక్టర్ దంపతుల రాజీనామా - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా వార్డులో డ్యూటీ..  డాక్టర్ దంపతుల రాజీనామా

March 25, 2020

jbnjgb

వైద్యున్ని దేవుడితో పోల్చుతారు. ఎవరికీ దండం పెట్టినా పెట్టకున్నా వారికి మనస్పూర్తిగా నమస్కారం పెడతారు. ఎందుకంటే ప్రాణాలు పోసే కనిపించే దైవంగా వారిని భావిస్తారు కాబట్టి. డాక్టర్లు కూడా రోగులకు ఎంతటి కష్ట పరిస్థితుల్లో అయినా వైద్యసేవలు అందిస్తారు. ఇప్పుడు ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనాపై పోరాటానికి కూడా డాక్టర్లు తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ధైర్యంగా వైద్యం అందిస్తున్నారు. వీరి సేవలకు గుర్తుగా ఇటీవల దేశ ప్రజలంతా చప్పట్లు కొట్టి ప్రశంసించారు. కానీ ఝార్ఖండ్‌లో మాత్రం ఓ డాక్టర్ దంపతులు కరోనా వార్డులో డ్యూటీ ఇష్టం లేక ఉద్యోగాలనే వదులుకున్నారు. 

వెస్ట్ సింగ్‌భూమ్ జిల్లాలోని జంషడ్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు డాక్టర్లు తీసుకున్న ఈ నిర్ణయం సంచలనం రేపింది.  ఇటీవల డాక్టర్ టిర్కీని కరోనా రోగుల ఐసోలేషన్ వార్డులో నియమిస్తూ వైద్యాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వైరస్ భయంతో టిర్కీతో పాటు అతని భార్య డాక్టర్ సౌమ్య వారి ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నట్లు వాట్సాప్‌లో లేఖ పంపారు. ఈ విషయాన్ని ఆస్పత్రి సూపరింటిండెంట్ వైద్యఆరోగ్య శాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఆరోగ్యశాఖ కార్యదర్శి నితిన్ మదన్ వారి రాజీనామాను తిరస్కరించారు. 

డాక్టరు దంపతులిద్దరూ 24గంటల్లోగా విధుల్లో చేరాలని లేకుంటే ఝార్ఖండ్ ఎపిడమిక్ డిసీజెస్ రెగ్యులేషన్ 2020 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అత్యవసర సమయంలో వైద్య సేవలు అందించకుండా తప్పించుకునే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ..ఎంసీఐ రిజిస్ట్రేషన్ ను కూడా రద్దు చేపిస్తామని కార్యదర్శి అల్టిమేటం జారీ చేశారు.

టిర్కీ మాత్రం తనన భార్య అనారోగ్య కారణాల కారణంగా రాజీనామా చేసినట్టు చెబుతున్నాడు. తనకు ఇటీవలే కిడ్నీ మార్పిడి జరిగినందున రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని, అందుకే ఉద్యోగాలకు రాజీనామా చేశామని తెలిపాడు. తాను పారిపోయే వ్యక్తిని  కాదని స్పష్టం చేస్తున్నాడు. కరోనా సంక్షోభం ముగిశాకే ఉద్యోగాన్ని వదిలివేస్తామని తెలిపాడు.