ఆలోచన అదిరింది..బొమ్మకు ట్రీట్‌మెంట్..చిన్నారి సైలెంట్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆలోచన అదిరింది..బొమ్మకు ట్రీట్‌మెంట్..చిన్నారి సైలెంట్

August 30, 2019

Doctor First Had To Doll Then Treat 11-Month Baby

ముద్దులొలికే బుజ్జి పాపాయిలంటే అందరికి ఇష్టమే. కానీ వారు మారం చేస్తే మాత్రం ఓదార్చడం శక్తికి మించిన పనే. వారికోసం ఎన్నో రకాల ఫీట్లు చేయాల్సి ఉంటుంది. బొమ్మలు ఇవ్వడం, గంతులు వేయడం ఇలా వారిలా మారిపోవాల్సి వస్తుంది. వారికి నచ్చింది ఇవ్వకపోతే చెప్పాల్సిన అవసరమే లేదు. అలాగే ఢిల్లీలోని ఓ చిన్నారిని కూడా ఊరడించడానికి వారి తల్లిదండ్రులు తెగ ఫీట్లు చేయాల్సి వచ్చింది. ఇంతకీ వారు ఏం చేశారని అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.!  

ఢిల్లీకి చెందిన జిక్రా మాలిక్ అనే 11 నెలల చిన్నారి ఈనెల 17న కిందపడిపోవడంతో ఆమె రెండు కాళ్లు విరిగిపోయాయి. దీంతో ఆమెకు వైద్యం చేయించేందుకు తల్లిదండ్రులు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు చేస్తున్న వైద్యానికి ఏ మాత్రం సహకరించలేదు. బిగ్గరగా ఏడుస్తూ ఒకే చోట ఉండకుండా కాలు కదిపేది. దీని వల్ల ఇబ్బంది అవుతుందని భావించిన డాక్టర్లు పెయిన్ కిల్లర్ చాకెట్లు ఇచ్చారు. అయినా అలాగే చేయడంతో తల్లిదండ్రులకు ఓ చక్కటి ఆలోచన వచ్చింది. తమ పాపాయి ఏం చేయాలన్నా వెంట తన అందమైన బొమ్మ ఉంటే చాలు అని చెప్పారు. ఆమెను ఓదార్చాలంటే అదొక్కటే చిట్కా అంటూ చెప్పారు. వెంటనే ఆ బొమ్మను తెప్పించి చిన్నారి బెడ్ పక్కనే పడుకోబెట్టారు. బొమ్మకు ట్రీట్‌మెంట్ చేసినట్టుగా నటించి చిన్నారి కాళ్లకు కట్లు కట్టారు. ఆమెకు అనుమానం రాకుండా ముందుగానే బొమ్మ రెండు కాళ్లకు బ్యాండేజీ వేసి కాళ్లు పైకి కట్టారు. బొమ్మకు కట్టినట్టుగానే జిక్రాకు కూడా కట్టారు. 

ఆ బొమ్మను చూపిస్తూనే చిన్నారికి వైద్యం చేస్తున్నారు. పాలు, ఆహారం అంతా ఇద్దరికి కలిపి ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బొమ్మను చూపించి చిన్నారికి వైద్యం చేయడం సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం చిన్నారి హాస్పిటల్‌లో కోలుకుంటోంది. త్వరలోనే ఆమెను డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెబుతున్నారు. బొమ్మ వల్ల తమకు శ్రమతప్పిందంటూ వారు అంటున్నారు.