Doctor Meghna saved the leopard that fell into the well in karnataka
mictv telugu

బావిలో ఒంటరిగా దిగి చిరుతను కాపాడిన లేడీ డాక్టర్.. వీడియో

February 14, 2023

Doctor Meghna saved the leopard that fell into the well in karnataka

ఓ మహిళా పశు వైద్యురాలు చిరుత కోసం సాహసం చేశారు. బావిలో పడ్డ చిరుతను కాపాడడం కోసం ధైర్యం చేసి ఒంటరిగా బావిలోకి దిగారు. ఏడాది వయసున్న చిరుతపులికి మత్తు మంతు ఇంజెక్ట్ చేసి తన బోనులోనే సురక్షితంగా పైకి తీసుకువచ్చారు. కర్ణాటకలోని మంగళూరు సమీపంలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నిడ్డోడి ప్రాంతంలోని ఓ బావిలో రెండు రోజుల క్రితం ఓ చిరుత ప్రమాదవశాత్తు పడిపోయింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు చిరుతను కాపాడేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. అవి విఫలం అవడంతో పశువైద్యులను పిలిపించగా, వారు సాహసం చేసి చిరుతను రక్షించారు.

మేఘనా అనే పశు వైద్యురాలు ఈ ఆపరేషన్‌లో కీలకంగా వ్యవహరించారు. మత్తు మందు ఇంజక్షన్‌తో కూడిన తుపాకీని చేత్తో పట్టుకుని బోనులో ఒంటరిగా బావిలోకి దిగిన మేఘన.. విజయవంతంగా చిరుతకు మత్తు మందు ఇచ్చారు. దీంతో స్పృహ తప్పిపడిపోయిన చిరుతను చాకచక్యంగా అదే బోనులో ఎక్కించి పైకి తీసుకువచ్చారు. అనంతరం చిరుతకు సపర్యలు చేసి స్పృహ వచ్చిన తర్వాత అడవిలో వదిలేశారు. ఈ మొత్తం ఘటనలో కీలకంగా వ్యవహరించిన మేఘనతో పాటు వైద్యుల బృందంలోని మిగతా సభ్యులు డాక్టర్ పృథ్వీ, డాక్టర్ యశస్వి, డాక్టర్ నసీఫాలను స్థానికులు అభినందించారు.