Doctors Assist Pregnant Woman Deliver Over Whatsapp Call In Keran Of Jammu And Kashmir
mictv telugu

3 ఇడియట్స్ సీన్ రిపీట్.. వాట్సాప్ కాల్ ద్వారా డెలివరీ

February 13, 2023

Doctors Assist Pregnant Woman Deliver Over Whatsapp Call In Keran Of Jammu And Kashmir

త్రీ ఇడియట్స్‌ సినిమాలో వీడియో కాల్ ద్వారా ఓ ప్రెగ్నెంట్ లేడీకి హీరోయిన్ డెలివరీ చేసే సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాంటి ఘటనే జమ్మూకశ్మీర్‌లో జరిగింది. ఓవైపు మారుమూల ప్రాంతం.. మరోవైపు ప్రతికూల వాతావరణం కారణంగా వాట్సాప్‌ కాల్‌తో ఓ మహిళకు ప్రసవం చేసి తల్లీబిడ్డ ప్రాణం నిలిపారు డాక్టర్లు. కుప్వారా జిల్లా కేరాన్ గ్రామంలో ఓ మహిళ ప్రసవ వేదన పడుతోంది. అయితే…మంచు కురుస్తుండటం వల్ల అప్పటికప్పుడు ఆమెను ఆసుపత్రికి తరలించడం కష్టమైంది. అప్పటికే ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి. ఏం చేయాలో అర్థం కాక కుటుంబ సభ్యులు ఆందోళన పడుతుండగా వైద్యులు అప్పటికప్పుడు ఓ మెరుపు ఆలోచన చేశారు. వాట్సాప్‌ కాల్‌ ద్వారా సలహాలు, సూచనలు ఇస్తూ డెలివరీ చేయించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రసవించేలా సహకరించారు.

కేరాన్‌లోని పీహెచ్‌సీకి ఓ మహిళ పురిటి నొప్పులతో బాధ పడుతూ వచ్చిందని…అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా ఉందని వివరించారు అక్కడి డాక్టర్లు. అయితే…కేరాన్‌ ప్రాంతానికి పరిసర గ్రామాలకు మంచు కారణంగా దారి లేకుండా పోయింది. ఆసుపత్రికి తరలించాలంటే తప్పకుండా హెలికాప్టర్ కావాల్సిందే. అయితే…అప్పటికీ మంచు తీవ్రంగా కురుస్తుండటం వల్ల అధికారులు అది సాధ్యపడదని చెప్పారు. ఏదో ఓ ప్రత్యామ్నాయం చూసుకోవాలని చెప్పారు. పీహెచ్‌సీలోని మెడికల్ స్టాఫ్‌కు ఏం చేయాలో పాలుపోలేదు. క్రాల్‌పొరలోని సబ్‌డిస్ట్రిక్ హాస్పిటల్‌లో పని చేసే గైనకాలజిస్ట్ హీహెచ్‌సీలోని డాక్టర్లు వాట్సాప్ కాల్ చేసి గైడ్ చేశారు. సురక్షితంగా శిశువును ఎలా బయటకు తీయాలో చెప్పారు. ఆమె చెప్పినట్టే చేయగా..సుఖ ప్రసవం అయింది. ఆడ శిశువు జన్మించింది. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు.

ఈ ఘటనపై క్రాల్‌పోరా బ్లాక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మీర్ మహ్మద్ షఫీ మాట్లాడుతూ.. శుక్రవారం రాత్రి సంక్లిష్టమైన పరిస్థితుల్లో ప్రసవ వేదనతో అల్లాడుతున్న గర్భిణీని తాము ఆదుకున్నామని తెలిపారు. సుమారు ఆరు గంటల పాటు డాక్టర్లు శ్రమించిన తర్వాత.. ఆ మహిళ ఓ ఆడశిశువుకు జన్మనిచ్చిందనీ, ప్రస్తుతం తల్లి, పిల్ల ఇద్దరూ పరిశీలనలో ఉన్నారని, వారిద్దరూ ఆరోగ్యంగానే ఉన్నట్లు డాక్టర్‌ షఫీ వెల్లడించారు.